హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సర్కార్ (Telangana govt) సైతం అప్రమత్తమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) నేడు అసెంబ్లీలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశంలో 65 మందికి కరోనా వచ్చిందని.. అందులో 17 విదేశీయులు ఉన్నారని తెలిపారు. 65 మందిలో 10 మందికి కరోనా వైరస్ నయం కాగా దురదృష్టవశాత్తుగా ఇద్దరు చనిపోయారని... బయటి దేశాల నుంచి వచ్చే వారే ఈ వైరస్‌ని మోసుకొస్తున్నారని పలు కేసులను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తెలియడంతో అతడికి గాంధీ ఆస్పత్రిలో (Coronavirus in Hyderabad) చికిత్స అందిస్తున్నారని.. అలాగే పూణెలోని ల్యాబ్ నుంచి మరో ఇద్దరి అనుమానితుల రిపోర్ట్ రావాల్సి ఉందని అన్నారు.
దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడం మనకు గర్వ కారణం అని చెబుతూ... అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్‌కి వచ్చే వారి సంఖ్య కూడా అంతే ఎక్కువని అన్నారు. కరోనావైరస్ వ్యాపించిన ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది హైదరాబాద్‌కి వస్తున్నారు. విదేశీయులను భారత్‌లోకి రాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ... ఆయా దేశాల్లో ఉంటున్న మన భారతీయులు మన దేశానికి తిరిగొస్తున్నారు కనుక విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ప్రపంచం నలుమూలల నుంచి రాకపోకలు సాగుతున్నందున హైదరాబాద్ కూడా రిస్క్ జోన్‌లో ఉందని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో తగిన జాగ్రత్తలు వహిస్తున్నామని.. కాకపోతే ఈ విషయాలన్నీ బయటికి చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకూడదనే ఉద్దేశంతోనే ఇదివరకు వెల్లడించలేదని తెలిపారు. ఏదేమైనా ప్రజలకు తెలియజేయాలనే బాధ్యత తమపై ఉందని భావిస్తూ ఈ విషయాలను ఈ సభ ద్వారా వెల్లడిస్తున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు.
విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ టెస్టులు చేసేలా ఎయిర్ పోర్టులో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించాం. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో పాఠశాలలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ బంద్ చేయాలా? వద్దా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కరోనావైరస్‌ని టాప్ ప్రయారిటీగా భావిస్తున్నందున.. అవసరమైతే రూ.5000 కోట్లు వెచ్చించడానికైనా వెనుకాడమని సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. శనివారం సాయంత్రం కేబినెట్ భేటీలో కరోనావైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై చర్చిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వైరస్ ప్రభావం అంతగా లేదని.. అయితే, వైరస్ వ్యాపించక ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్తున్నట్టు సీఎం కేసీఆర్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..