KCR VS MODI: జగన్ అలా.. కేసీఆర్ ఇలా! తెలంగాణకు లాభమా..నష్టమా?

KCR VS MODI:  రాజకీయ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి దూరంగా ఉండటం ఓకే కాని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని పదేపదే ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రధాని పర్యటనలో పాల్గొని తన అసమ్మతిని తెలుపవచ్చు కదా అనే టాక్ జనాల నుంచి వస్తోంది.

Written by - Srisailam | Last Updated : Nov 12, 2022, 03:12 PM IST
KCR VS MODI: జగన్ అలా.. కేసీఆర్ ఇలా! తెలంగాణకు లాభమా..నష్టమా?

KCR VS MODI:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి ముఖం చాటేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి ముచ్చటగా మూడోసారి దూరంగా ఉన్నారు. కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్దమే సాగుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, సవాళ్లు విసురుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అని నినదిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తిరుగుతూ మోడీ, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ పోరాటంపై ఎవరికి అభ్యంతరాలు లేకున్నా..ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు డుమ్మా కొట్టడంపై రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ చర్చ సాగుతోంది.

రాజకీయ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి దూరంగా ఉండటం ఓకే కాని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని పదేపదే ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రధాని పర్యటనలో పాల్గొని తన అసమ్మతిని తెలుపవచ్చు కదా అనే టాక్ జనాల నుంచి వస్తోంది. కేసీఆర్ లానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అయినా వాళ్లు ప్రధాని తమ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ప్రొటోకాల్ పాటిస్తూ సాదరంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మోడీతో  కలిసి వేదిక పంచుకుంటున్నారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ సాయం చేయాలని కోరుతున్నారు. బీజేపీ అంటేనే భగ్గుమనే కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ప్రధాని తమ రాష్ట్రానికి వస్తే హాజరవుతున్నారు. వాళ్లందరికి భిన్నంగా ప్రధాని మోడీని కేసీఆర్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా విభేదాలున్నా ప్రభుత్వాల పరంగా పరస్పరం సహకారం అవసరమని.. కేసీఆర్ తీరు సరికాదనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ ప్రధానమంత్రిని అవమానిస్తుందని కమలం నేతలు పైరవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. రెండు రోజుల ఏపీ టూర్ లో భాగంగా శుక్రవారం రాత్రి విశాఖలో ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టాలని పిలుపిచ్చారు. జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న మోడీ.. ప్రజా సమస్యలుపై పోరాడి జగన్ సర్కార్ ను బోనులో నిలబెట్టాలని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రధాని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా.. మోడీ పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. మోడీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఏపీకి అండహా ఉండాలని అభ్యర్థించారు. విభజన గాయాల నుంచి ఏపీ పూర్తి కోలుకోలేదని, కేంద్రం చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి ఉపయోగ పడుతుందని జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు.

ప్రధాని మోడీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ తీరుతో పోలుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు, కొన్ని వర్గాల ప్రజలు. కేంద్ర ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా ప్రధాని మోడీ పర్యటనల్లో అధికారికంగా పాల్గొని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తే బెటరని సూచిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెబుతున్నారు. రాజకీయ కారణాలతో అధికారిక పర్యటనలకు దూరంగా ఉండటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటున్నారు. ప్రధానితో కయ్యం పెట్టుకుంటూ  రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడం లేదని చెబితే ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ వలే సమస్యలను ఏకరువు పెట్టవచ్చని సూచిస్తున్నారు.

Also Read :  Project K Director Nag Ashwin : మనిషి పుట్టుకతో సమానం.. సినిమా గురించి గొప్పగా చెప్పిన ప్రాజెక్ట్ కే డైరెక్టర్ నాగ్ అశ్విన్

Also Read : Yashoda Box Office Collection Day 1 : యశోద ఫస్ట్ డే కలెక్షన్లు.. సమంతకు పెద్ద అమౌంటే కానీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News