దమ్ముంటే విద్యుత్‌కి సంబంధించిన అంశాల గురించి చర్చించేందుకు ముందుకు రావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విసిరిన సవాల్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. 'రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడికి రావడానికైనా మేము రెడీ. అవసరమైతే ప్రగతి భవన్ కైనా వస్తాం. ఎక్కడికి రావాలో మీరే చెప్పండి? విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను నిరూపించడానికి మేము సిద్ధంగా వున్నాం. అప్పుడు ఎవరు మాట్లాడేది తప్పో, ఎవరు మాటలు ఒప్పో జనానికి తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారు' అని దీటుగా జవాబు ఇచ్చారు.
అంతకన్నా ముందుగా ఈ విషయమై మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంటే, ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా ఒకవేళ వాళ్లు చేసే ఆరోపణల్లో నిజమే వుంటే, వాటిపై చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరారు.