Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?

Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 10:26 PM IST
Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?

Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశాం. అలాగే తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యావాదాలు చెబుతున్నాను అని అన్నారు. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి స్వాగతించిన రాహుల్ గాంధీ... కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వీడకుండా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు.

బీఆరెస్ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల కలలు కల్లలుగా మారాయి అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు టీఆరెస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. కేసీఆర్ తనకు తాను ఒక రాజు అనుకుంటూ తెలంగాణను తన జాగీరుగా భావిస్తున్నారు అని మండిపడ్డారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ ధరణి పేరుతో లాక్కున్నారు. ఇదే విషయమై భారత్ జోడో యాత్రలో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను లాక్కోవడానికి అవేమీ కేసీఆర్ సొత్తు కాదు హెచ్చరించిన రాహుల్ గాంధీ.. ఆ భూములపై పేదలకే హక్కు ఉందని.. అవి పేదలకే చెందాలి అని స్పష్టంచేశారు. 

ధరణి పేరుతో సీఎం కేసీఆర్ వేల ఎకరాల భూములను దోచుకున్నారు. రైతులు, ఆదివాసీలు, యువకులు, దళితులు.. ఇలా ఒకటేమి సబ్బండ వర్గాలను సీఎం కేసీఆర్ దోచుకున్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే... బీఆరెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా పనిచేసింది. కేసీఆర్ రిమోట్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 

వరంగల్ డిక్లరేషన్, సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్‌తో ఒక ముందడుగు వేశాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ రూ 4000 అందిస్తాం అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములన్నింటికీ పట్టాలు అందిస్తాం. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయి. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. విపక్షాల సమావేశానికి బీఆరెస్ పార్టీని పిలవమని కొందరు చెప్పారు. కానీ బీఆరెస్ పార్టీని పిలిస్తే కాంగ్రెస్ సమావేశానికి రాదు అని మేం స్పష్టం చేశాం. బీజేపీకి బీ టీమ్ బీఆరెస్ పార్టీతో కాంగ్రెస్ ఎప్పుడూ కలవదు. బీఆరెస్ బీజేపీ రిష్టాచార్ సమితి. కర్ణాటకలోలాగే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ శక్తిని చూపాలి. బీజేపీ బీ టీమ్ కు బుద్ది చెప్పి రాష్ట్రంలో  కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి అని రాహుల్ గాంధీ తెలంగాణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Trending News