వచ్చేది వానాకాలం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తమవుతోంది. మంత్రి కేటీఆర్.. ఇవాళ (శనివారం) మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వచ్చే వానాకాలానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనే దానిపై అధికారులతో చర్చించారు.
హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు కరోనా కట్టడిలో కీలక పాత్ర వహించినందుకు అందరినీ అభినందించారు. ఇదే విధంగా భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని సూచించారు. వానాకాలంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఒకవేళ దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. అందుకే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్‌తో జీవించడం తప్పదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది అంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
మరోవైపు సీజనల్ వ్యాధుల నివారణ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కేటీఆర్ తెలిపారు. రేపటి నుంచి (ఆదివారం) అంటే 'ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు' పేరిట సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. యాంటీ లార్వా యాక్టివిటీస్ కార్యక్రమాన్ని రేపటి నుంచే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి పట్టణంలో మురుగు కాల్వలను శుభ్రం చేయాలని కేటీఆర్ సూచించారు. వానాకాలంలో మ్యాన్ హోల్స్ ల జాగ్రత్త అవసరం కాబట్టి.. అలాంటి వాటిని గుర్తించి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..