KTR On Auctioning Of Singareni Coal Mines: తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. అద్భుతమైన అభివృద్ధి వైపు దూసుకువెళుతున్న తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు.
బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు చేసిన ప్రకటనపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాలను తెలంగాణను దెబ్బతీసే ప్రయత్నాన్ని కేంద్రం కొనసాగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అన్ని అడ్డంకులను దాటుకొని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తున్నామన్నారు. తెలంగాణని దెబ్బతీసేందుకు దొడ్డి దారిన కేంద్రం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోభాగంగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆయువుపట్టు అయిన సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్ కోసం తమ వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధాని.. తెలంగాణ సమాజంపై ఈర్ష్యతో సింగరేణి గనులకు వేలం వేస్తున్నారని.. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు అని కేటీఆర్ ప్రశ్నించారు.
'ఓ వైపు మోదీ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ నమ్మబలిస్తుండగా.. మరోవైపు సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలానికి పెట్టడం వారి ద్వంద ప్రమాణాలకు, భూటకపు మాటలకు అద్దం పడుతుంది. దేశంలోనే అత్యధికంగా పీఎల్ఎఫ్ సాధించిన సింగరేణిని దెబ్బకొట్టే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుంది. బొగ్గు తవ్వకమే సింగరేణికి ప్రధాన విధి.. అలాంటి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పాట పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేస్తోంది.
సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ గారు ప్రధానికి లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతుంది. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులన్నింటిని ప్రవేట్‌కు అప్పగిస్తే.. మరి సింగరేణి కాలరీస్ సంస్థ చేయాల్సిన పని ఇంకేం మిగిలి ఉంటుంది..? బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే..' అని కేటీఆర్ అన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణ కేవలం సింగరేణి విస్తరించిన ఏడేనిమిది జిల్లాల సమస్య కాదని.. సమస్త తెలంగాణ అంశమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న విద్యుత్ సరఫరాను దెబ్బతీయచ్చన్న ఆలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ చీకట్లోకి జారుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో బీజేపీ విజయం సాధిస్తే.. తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందన్నార కేటీఆర్. సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దు అవుతాయన్నారు. సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమెసే కుట్రలు ఇకనైనా ఆపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ ద్వారా సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. కేంద్రం కుట్రలపై పోరాడేందుకు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: Chamika Karunaratne: అయ్యో కరుణరత్నే.. క్యాచ్ కోసం మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు.. వీడియో వైరల్
Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు షాక్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి