Sridhar Babu: రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ.. కొత్తగా 1800 ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

Minister Duddilla Sridhar Babu: శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. రానున్న మూడేళ్లలో ఈ పరిశ్రమ 1800 ఉద్యోగాలు కల్పిస్తుందని వెల్లడించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 21, 2024, 07:03 PM IST
Sridhar Babu: రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ.. కొత్తగా 1800 ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

Minister Duddilla Sridhar Babu: విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. గురువారం శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1800 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు. రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. 

Also Read: Real Estate: హైదరాబాద్‎లో ఇళ్లు కొనడం అంత ఈజీ కాదు..ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే   

2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఎరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు. ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 

ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Infinix Note 40X Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్‌.. రూ.3,049కే Infinix Note 40X ఫోన్‌.. ఆఫర్‌ మిస్‌ చేసుకుంటే బాధపడతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News