హైదరాబాద్ : నవరస నటనా సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి ( NTR birth anniversary ) సందర్భంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన విగ్రహానికి లక్ష్మీ పార్వతీ ( Lakshmi parvathi ) నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana CM KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకు ( AP CM YS Jagan ) ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ ( NT Rama Rao ), వైఎస్ఆర్ ( YS Rajasekhar Reddy ) ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆమె.. మరోవైపు తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తెలుగు వారి కష్టాలను తీర్చటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నారని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కొనియాడిన ఆమె.. అదృష్టం కొద్దీ రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు లభించారని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ఇద్దరూ కృషి చేస్తున్నారని చెబుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించే వారికే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.