ఏ బంగారు తెలంగాణ కోసమైతే, రాష్ట్రం సాధించుకున్నామో.. ఆ కల సాకారం అవడం లేదని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇటీవల జరిగిన కంగ్రెస్ పార్టీ సమావేశంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో విఫలం అయ్యారు అని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగంలో వున్న ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి. అప్పుడే కలల తెలంగాణ సాకారం అవుతుందని కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు కోమటి రెడ్డి.
అంతేకాకుండా తమ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశిస్తే, కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ జిల్లా నుంచి పోటీ చేసి కేసీఆర్‌ని ఓడించడానికి సైతం తాను సిద్ధమేనని టీఆర్ఎస్ బాస్‌కి సవాల్ విసిరారు కోమటిరెడ్డి.