టీఆర్ఎస్‌కి శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ గుడ్ బై ?

బీజేపిలోకి శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ ?

Last Updated : Sep 23, 2019, 08:25 PM IST
టీఆర్ఎస్‌కి శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ గుడ్ బై ?

హుజూర్‌నగర్‌: తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు కాసోజు శ్రీకాంతా చారి తల్లి కాసోజు శంకరమ్మ టీఆర్‌ఎస్‌‌ను వీడి బీజేపిలో చేరనున్నట్టు తెలుస్తోంది. బీజేపిలో చేరడం ద్వారా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆమెకు హుజూర్ నగర్ నుంచి టికెట్ కేటాయించగా.. ఆమె అక్కడి నుంచి పోటీచేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కేటాయించకపోవడంతో అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఇదిలావుండగానే త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడిని సైది రెడ్డికే సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో మరోసారి టికెట్ ఆశించి భంగపడిన శంకరమ్మ ఇక టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపిలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు బీజేపి నుంచి సైతం శంకరమ్మకు ఆహ్వానం అందినప్పటికీ.. టికెట్ కేటాయింపు విషయంలోనే ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. 

హుజూర్ నగర్ నుంచి బీజేపీ టికెట్‌ కోసం అదే నియోజకవర్గానికే చెందిన జల్లేపల్లి వెంకటేశ్వర్లు, కోదాడకు చెందిన శ్రీకళారెడ్డి పోటీ పడుతున్నారు. వీరే కాకుండా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌, సీనియర్‌ న్యాయవాది రామారావు, ముద్ర అగ్రికల్చర్‌ సొసైటీ చైర్మన్‌ రామదాసప్పనాయుడు కూడా రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి పార్టీ శంకరమ్మను చేర్చుకుని ఆమెకే టికెట్ కేటాయిస్తుందా లేక స్థానిక నేతలకే ప్రాధాన్యం ఇస్తుందా అనేది మంగళవారం తేలిపోనుంది.

Trending News