వందకుపైగా గ్రంథాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పలు దశాబ్ధాలుగా తెలుగు సాహిత్యానికి పెద్దదిక్కుగా వ్యవహరించిన ప్రముఖ కవి, సాహితీవేత్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి (91) మనకు ఇక లేరు. జీవితాంతం సాహిత్యమే శ్వాసగా బతికిన సాహితీ పరిశోధకుడిగా డా కపిలవాయి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉన్న దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం జీనుకుంట కపిలవాయి స్వస్థలం. జీనుకుంటలో వెంకటాచలం, మాణిక్యమ్మ దంపతులకు 1928, మార్చి 31న కపిలవాయి లింగమూర్తి జన్మించారు.
డా కపిలవాయి లింగమూర్తి మృతితో ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కపిలవాయి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపిన కేసీఆర్.. సాహితీరంగంలో కపిలవాయి చేసిన కృషి ఎంతో అభినందించదగినది అని అన్నారు. తెలంగాణ సాహితీరంగం ఓ విశిష్ట వ్యక్తి, ఓ పెద్ద దిక్కుని కోల్పోయిందని పేర్కొన్నారు.
కపిలవాయి భౌతికకాయాన్ని ఇవాళ నాగర్‌కర్నూల్‌లోని స్వగృహానికి తరలించరానున్నారు. బుధవారం ప్రజలు, సాహితీవేత్తల సందర్శన అనంతరం కపిలవాయి భౌతికకాయాన్ని గురువారం స్థానిక హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.