CM Revanth Reddy: కేటీఆర్, హరీష్‌ రావుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్.. ఎవరూ ఊహించనిది..!

CM Revanth Reddy Speech: తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు మంచి చేయడమే తమ ఎజెండా అని.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో ఈటల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్‌ సూచనలు ఇవ్వాలన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 5, 2024, 04:06 PM IST
CM Revanth Reddy: కేటీఆర్, హరీష్‌ రావుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్.. ఎవరూ ఊహించనిది..!

CM Revanth Reddy Speech: తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో జి.వెంకటస్వామి (కాకా) ఒకరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాకా 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని తాను అధికారులను ఆదేశించానని అన్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారని చెప్పారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో  గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!

"కాకా పేదల మనిషి ఆయన పేదోళ్ల ధైర్యం. 80 వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాది. ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కాకా. జాతీయ స్థాయిలో నెహ్రూను చాచా అని పిలిస్తే రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారు. జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటిని ఇచ్చేసిన కాంగ్రెస్ వాది కాకా. కాకా ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది పార్టీ ఆలోచన. మూసీ పరివాహక ప్రాంతాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా..

ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు ప్రభుత్వం  స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంది. ఫామ్ హౌస్‌లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దు. ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దు. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది.

ఈటెల, కేటీఆర్, హరీష్‌కు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా. నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దాం. కేసీఆర్, కేటీఆర్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. మీరు ఫామ్ హౌస్‌ల్లో జమీందారుల్లా బతుకుతారు పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా..?

అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దాం. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు  నెలరోజుల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు సమస్య ఉంటే కలెక్టర్‌ను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం.." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:   సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News