KCR Meeting: 12న గులాబీ గర్జన.. సార్వత్రిక సమరానికి మాజీ సీఎం కేసీఆర్‌ సై

KCR Public Meeting In Karimnagar: సార్వత్రిక ఎన్నికలకు గులాబీ పార్టీ సై అంటోంది. కరీంనగర్‌లో భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించనుంది. లోక్‌సభ సమరానికి కదం తొక్కనుంది. గులాబీ బాస్‌ ప్రత్యేక.....

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 3, 2024, 10:16 PM IST
KCR Meeting: 12న గులాబీ గర్జన.. సార్వత్రిక సమరానికి మాజీ సీఎం కేసీఆర్‌ సై

Lok Sabha Poll BRS Party: అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ సంసిద్ధమవుతోంది. వీలైనన్ని అత్యధిక స్థానాలు సొంతం చేసుకునేందుకు కార్యాచరణ రచించనుంది. ఈ క్రమంలోనే కరీంనగర్ వేదికగా ఈనెల 12వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అక్కడి నుంచే సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించనుంది. ఈ మేరకు పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ప్రజల్లో అప్పుడే రేవంత్‌ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు.

Also Read: Half Day School: దంచికొడుతున్న ఎండలు.. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం ఉమమడి కరీంనగర్‌ జిల్లా పార్టీ నాయకులతో గులాబీ అధినేత కేసీఆర్‌ సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 'అతి కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రైతులు రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైంది' అని తెలిపారు.

Also Read: SkyWay: పదేళ్ల మా పోరాటం ఫలించింది.. రేవంత్‌ సర్కార్‌ పనులు చేయాలి: కేటీఆర్‌

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌, నీటి సమస్యలపై కేసీఆర్‌ స్పందిస్తూ.. 'కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, నిధులు ఇవ్వడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో రేవంత్ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజు వసూలు చేస్తున్నారు' అని గుర్తు చేశారు. కాళేశ్వరం వివాదంపై మాట్లాడుతూ.. 'ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం. మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం. కానీ మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా' అని తెలిపారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో గులాబీ జెండా ఎగురుతుందని  కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 'కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువబోతున్నది. పార్లమెంట్‌ సమరంలో భాగంగా ఈనెల 12న సంప్రదాయంగా వస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి' అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, ఎవరూ అధైర్యపడొద్దని పార్టీ నాయకత్వానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారని సమాచారం. అయితే అష్టమి కావడంతో అభ్యర్థుల పేర్ల ప్రకటన వాయిదా పడిందని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News