Bandi Sanjay: కేంద్రమంత్రి అలా అని ఉంటే ఎందుకు నిలదీయలేదు... అంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమే...

Bandi Sanjay Counter to TRS Govt: తెలంగాణ రైతులతో కేసీఆర్ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నారని... ధాన్యం కొనుగోలు సమస్యను రోజురోజుకు జటిలం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 09:40 PM IST
 Bandi Sanjay: కేంద్రమంత్రి అలా అని ఉంటే ఎందుకు నిలదీయలేదు... అంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమే...

Bandi Sanjay Counter to TRS Govt: తెలంగాణలో విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించారనడం టీఆర్ఎస్ చేస్తోన్న దుష్ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు ఆడటంలో, సెంటిమెంట్ రాజేయడంలో సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారని ఫైర్ అయ్యారు. ఎంతసేపు ఇతర పార్టీల నాయకులను, ఓట్లను కొనుగోలు చేయడం పైనే కేసీఆర్‌కు ధ్యాస తప్ప.. ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణ రైతులతో కేసీఆర్ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నారని... ధాన్యం కొనుగోలు సమస్యను రోజురోజుకు జటిలం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అంటే.. టీఆర్ఎస్ మంత్రులు ఆయన్ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. రైతాంగాన్ని గౌరవించే వ్యక్తి పీయూష్ గోయల్ అని పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలో సీఎం కేసీఆరే స్వయంగా సంతకం చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన టీఆర్ఎస్ మంత్రులు కొత్త రకం నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఓట్లు, సీట్లు కొనుగోలు చేసే కేసీఆర్ వడ్లు మాత్రం ఎందుకు కొనుగోలు చేయరని నిలదీశారు.

కాగా, యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. పండించిన ప్రతీ గింజ కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అసలు ఎంత ముడి బియ్యం ఇస్తారో ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పనే లేదని కేంద్రం అంటోంది. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి చర్చించారు. అయితే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే నూకల బియ్యాన్ని పీడీఎస్ కింద రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేయాలని కేంద్రమంత్రి సూచించారని.. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని టీఆర్ఎస్ మండిపడుతోంది. అయితే ఇదంతా కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారమేనని తాజాగా బండి సంజయ్ టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. 

Trending News