రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ ఓపెన్ ఛాలెంజ్ !

రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన అసదుద్దీన్ ఓవైసీ

Last Updated : Dec 1, 2018, 04:42 PM IST
రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ ఓపెన్ ఛాలెంజ్ !

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి దమ్ము, ధైర్యం కనుక ఉంటే 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసి తనపై విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారంనాడు జరగిన ఎన్నికల ప్రచారంలో పాల్గోని పార్టీ శ్రేణులను, కార్యకర్తలకు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓవైసీ ఈ ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ హాజరవుతున్న సభల కోసం బిర్యానీ, మద్యాన్ని సరఫరా చేసి జనాలను సమీకరిస్తున్నారని.. లేదంటే రాహుల్ సభలకు ఎవ్వరూ వెళ్లరని రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

మొన్నటివరకు బద్ధ శత్రువులైన కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం కోసం నిఖా చేసుకున్నాయని టీడీపీ, కాంగ్రెస్‌లను ఎద్దేవా చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి అభ్యర్థులను ఓడించాలని ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ ఓటర్లకు సూచించారు. గతంలోనూ ఇదే తరహాలో దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాల్సిందిగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

Trending News