చెన్నై సూపర్ కింగ్స్‌ని గెలిపించిన సురేష్ రైనా, రవీంద్ర జడేజా

చెన్నై సూపర్ కింగ్స్‌ని గెలిపించిన సురేష్ రైనా, జడేజా

Last Updated : Apr 14, 2019, 09:34 PM IST
చెన్నై సూపర్ కింగ్స్‌ని గెలిపించిన సురేష్ రైనా, రవీంద్ర జడేజా

కోల్‌కతా: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన 29వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేనకు ఓపెనర్ల రూపంలో శుభారంభం లభించింది. మొదట కుదురుగానే ఆడుతున్నట్టుగా కనిపించినప్పటికీ.. గర్నే వేసిన 3వ ఓవర్ తొలి బంతికి వాట్సన్ (6) ఎల్‌బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాటపట్టిన తర్వాత తక్కువ స్కోర్‌కే వరుసగా వికెట్లు పడటం మొదలైంది. 6వ ఓవర్‌లో సునీల్ నరైన్ వేసిన మూడో బంతికి డుప్లెసిస్(24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10వ ఓవర్‌లో చావ్లా విసిరిన తొలి బంతికే అంబటి రాయుడు (5) ఊతప్పకి క్యాచ్ ఇచ్చి తక్కువ స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టాడు. చావ్లా బౌలింగ్‌లోనే కేదార్ జాదవ్‌ సైతం ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కేదార్ జాదవ్ తర్వాత ధోనీ కూడా 13 బంతుల్లో 16 పరుగులు చేసి సునిల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

ఇలా వరుసగా వికెట్లు నష్టపోయి జట్టు కష్టాల్లో పడిందనుకుంటున్న తరుణంలో సురేష్ రైనా జట్టును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. 42 బంతుల్లో 58 పరుగులు (4X7, 6X1) రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా సైతం సురేష్ రైనాతో కలిసి 17 బంతుల్లో 31 పరుగులు (4X5) చేయడంతో మరో రెండు బంతులు మిగిలివుండగానే 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది. 

Trending News