నిదహాస్ ట్రోఫీలో భాగంగా కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా బుధవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన 5వ టీ-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకుపోయింది. మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్‌కే మొగ్గు చూపడంతో భారత్ బ్యాటింగ్‌కి దిగింది. భారత బ్యాటింగ్‌లో కెప్టేన్ రోహిత్ శర్మ 89, సురేష్ రైనా 47, శిఖర్ ధావన్ 35 పరుగులు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆటగాళ్లకు ఆదిలోనే టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ రూపంలో అనుకోని షాక్ తగిలింది. ఓపెనర్ లిటన్ దాస్ (7), సౌమ్యా సర్కార్ (1), తమీమ్ ఇక్బాల్ (27) లను సుందర్ వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టించాడు.
బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా(11) సైతం వారి బాటలోనే చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి క్రీజు నుంచి వెనుతిరిగాడు. తక్కువ పరుగులకే వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా రహీం చేసిన అర్థశతకం సైతం బంగ్లా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయింది. టీమిండియా బౌలర్ల సమష్టికృషి ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి ప్రవేశించింది.