టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. టీమిండియాపై ఆయన ప్రభావం ఎంతైనా ఉంది. 2014 ఆస్ట్రేలియా టూర్లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోనీ.. 2016లో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ రోజు హఠాత్తుగా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో .. అందుకు గల కారణాన్ని ధోనీ రెండేళ్ల తర్వాత వెల్లడించాడు.
‘2019 ప్రపంచ కప్‌కు సన్నద్ధం అయ్యేందుకు తదుపరి కెప్టెన్‌కు తగినంత సమయం ఇవ్వాలనే.. అప్పడు తప్పుకున్నా’ అని ధోనీ చెప్పాడు. ఇక ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి గురించి చెబుతూ.. తగినన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం ఓ కారణంగా మిస్టర్ కూల్ చెప్పాడు.
టెస్టు క్రికెట్లో టీమిండియాను నంబర్ 1 జట్టుగా ధోనీ తీర్చిదిద్దాడు. ధోనీ 199 వన్డేలు, 60 టెస్టులు, 70 టీ20ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తంగా 331 మ్యాచ్‌ల జట్టుకు నాయకత్వం వహించాడు. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు 27 టెస్టుల్లో, 110 వన్డేల్లో గెలుపొందింది. అతడి నాయకత్వంలో టీమిండియా 70 టీ20లు ఆడితే 41 మ్యాచుల్లో విజయం సాధించింది.
ఒక కెప్టెన్‌గా ధోనీ రెండు ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఒక టైటిల్ 50-ఓవర్ ఫార్మాట్లో (2011) దక్కితే, రెండోది 20-ఓవర్ ఫార్మాట్లో (2007) దక్కింది. 2008లో ఆస్ట్రేలియా ట్రై సిరీస్ టైటిల్‌ను, ఇంగ్లండ్‌లో 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ నాయకత్వంలోని టీమిండియా గెలిచింది.