Virat Kohli Unfollows Sourav Ganguly On Instagram: విరాట్ కోహ్లీకి బీసీసీఐ మాజీ చైర్మన్, మాజీ టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీకి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఢిల్లీ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. బెంగళూరు vs ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రౌండ్లోంచి వెలుపలికి రావడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు, మెంటార్స్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అభివాదం చేసుకునే క్రమంలో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఒకరినొకరు అవాయిడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.
ఇద్దరు క్రికెట్ దిగ్గజాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కామెంట్స్ చేసుకోవడం కనిపించింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు గంగూలీ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే విరాట్ కోహ్లీ కేప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనేది పబ్లిక్ టాక్.
తన నుంచి కేప్టేన్సీ చేజారిపోయేలా చేసింది సౌరవ్ గంగూలీనే అని ఆగ్రహంతో గంగూలీపై విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నట్టు ఎన్నో సందర్భాల్లో వార్తా కథనాలు వైరల్ అయ్యాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదిలావుండగా, తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ తరువాత ఇరు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో గంగూలీ సైతం కోహ్లీ వద్దకు రాగానే వెనక్కి వెళ్లిన తీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో గంగూలీ వైఖరిపై మరింత విసుగు చెందిన విరాట్ కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేసినట్టు తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు సౌరవ్ గంగూలీని ఫాలో చేసిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అన్‌ఫాలో చేశాడంటూ కథనాలొస్తున్నాయి. అదే కానీ నిజమైతే.. విరాట్ కోహ్లీకి, గంగూలీకి ఇప్పటివరకు ఉన్న అంతో ఇంతో కనెక్షన్ ఇక పూర్తిగా కట్ అయినట్టేననే టాక్ వినిపిస్తోంది. గంగూలీని పూర్తిగా పక్కకు పెట్టేసే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కోహ్లీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరోవైపు సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ తీరును తప్పుపడుతున్నారు. ఒక సీనియర్ క్రికెటర్.. అందులోనూ లెజెండరీ పర్సనాలిటీతో బిహేవ్ చేసే పద్ధతి ఇది కాదని.. ఆ మాటకొస్తే.. కోహ్లీ చూపిస్తున్న యాటిట్యూడ్ గంగూలిలో ఇంకాస్త ఎక్కువే ఉంటుంది అంటూ తమ ఫేవరైట్ క్రికెటర్ని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ మధ్య నడుస్తున్న ఈ సైలెంట్ వార్ రాబోయే కాలంలో ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచిచూడాల్సిందే మరి.