ఐపీఎల్ : ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీకి గంభీర్ గుడ్ బై

    

Last Updated : Apr 25, 2018, 08:36 PM IST
ఐపీఎల్ : ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీకి గంభీర్ గుడ్ బై

క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. అతని స్థానంలో జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ సీజన్ మొత్తం శ్రేయస్ ఆ బాధ్యతలు తీసుకుంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 11వ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ డేర్ డెలిల్స్ జట్టు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపు సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో గంభీర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

మొత్తం ఏడు సీజన్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గంభీర్ ఆ జట్టుని 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిపాడు. కానీ ఈ ఏడాది మాత్రం గంభీర్ ను తీసుకునేందుకు ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఢిల్లీ గూటికి చేరిన గంభీర్‌కు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు చేయకపోవడంతో గంభీర్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  అటు వ్యక్తిగతంగాను ఈ సీజన్ లో గంభీర్ అంతగా రాణించలేదు.  టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా బరిలోకి దిగి ఆరు మ్యాచుల్లో 17 పరుగుల సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. 

వైఫల్యానికి నైతిక బాధ్యత

రాజీనామా నిర్ణయంపై గంభీర్ స్పందించాడు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది తన నిర్ణయమేనని .. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదన్నారు. టీం విజయం కోసం తాను ఊహించినంత కృషి చేయలేదన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు గంభీర్ ప్రకటించారు. 

Trending News