ఆసియాకప్ లో టీమిండియా ఘన విజయం. చిరకాల శత్రువు పాక్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు భారత్ బౌలర్ల ధాటికి 43.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు భూవనేశ్వర్ ( 3 వికెట్లు ), కేదార్ జాదవ్ ( 3 వికెట్లు ) పాక్ పతనాన్ని శాసించడంలో కీలక పాత్ర పోషించారు. బాబర్ అజామ్ (47), షోయబ్ మాలిక్ (43) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 29 ఓవర్లలోనే 2 వికెట్లకు 164 పరుగులు సాధించింది. ఫలితంగా చిరకాల ప్రత్యర్ధి పాక్ పై చిరస్మరణీయమైన విజయం సాధించింది. భారత తరఫున ఓపెనర్లు రోహిత్ శర్మ (52), శిఖర్ ధావన్ (46) శుభారంభాన్నందించగా అంబటి రాయుడు (31 నాటౌట్), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. మూడు కీలక వికెట్టు తీసి పాక్ పతనాన్ని శాసించిన టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా దక్కింది.
అంచనాలకు భిన్నమైన ప్రదర్శన
తొలి మ్యాచ్ లో పసికూన హాంకాంగ్ పై అతికష్టంమీద మీద నెగ్గింది భారత్.. అదే హాంకాంగ్ పై సునాయసంగా విజయం సాధించింది పాక్. పాక్ జోరును చూసి భారత్ ను కూడా అదే స్థాయిలో మట్టికరిపిస్తుందని తొలుత విశ్లేషణలు జరిగాయి. వీటిన్నంటిని పటాపంచాలు చేస్తూ భారత్ విజృంభించింది. ఫలింతంగా పాక్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా బరిలోకి దిగిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ సూపర్ - 4 దశకు చేరుకుంది. అలాగే పాక్ కూడా సూపర్ - 4 కు అర్హత సాధించింది. దీంతో సూపర్ -4 దశలో ఇరు జట్లు ఆదివారం మళ్లీ తలపడబోతున్నాయి.
చిరకాల ప్రత్యర్ధిని చిత్తు చేసిన టీమిండియా