Bathukamma Festival Flowers: దసరాలో భాగంగా తెలంగాణ వాసులు జరుపుకొనే సంప్రదాయబద్ధమైన పండుగ బతుకమ్మ. దేవీ నవరాత్రులైన ఈ తొమ్మిది రోజులు తెలంగాణలోని ప్రతి గడప బతుకమ్మ పూజతో, రంగురంగుల పువ్వులతో కళకళలాడుతుంది. బతుకమ్మ పాటలు.. జానపద కథలు.. ఆడపిల్లల ఆటల తో ప్రతి వీధి ప్రతి ఊరు పండగ వాతావరణం సంతరించుకొని అంబరాన్ని అంటే సంబరాలు చేసుకుంటాయి. ఈ బతుకమ్మ పూజ కోసం ప్రతి ఇంట్లో ప్రత్యేకించి పలు రకాల పూలను ఉపయోగించి గోపురం ఆకారంలో బతుకమ్మను తయారుచేస్తారు.
రంగురంగుల పువ్వులతో అందంగా అమర్చి బతుకమ్మ తయారీ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసా. పూల తోటే గౌరీ మాతను తయారుచేసి పూజించడమే బతుకమ్మ ప్రత్యేకత. ఇందుకోసం ఉపయోగించే ప్రతి పువ్వులో ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంది. ఆరోగ్యానికి మంచి చేసే ఈ ఔషధ గుణాల కారణంగా వీటిని ప్రత్యేకించి ఇలా బతుకమ్మలో పేర్చడానికి ఉపయోగిస్తారట. మరి అవి ఏమిటో? వాటి విశేషాలు ఏమిటో? తెలుసుకుందాం..
గుమ్మడి పూలు:
నిండుతనానికి మారుపేరైన గుమ్మడి పువ్వులు బతుకమ్మ పూజలో ప్రముఖంగా వాడుతారు. ఈ పువ్వులలో విటమిన్ ఏ తో పాటు సి కూడా పుష్కలంగా దొరుకుతుంది. శరీరం మీద చర్మం పొడిబారి పోయి, పెచ్చులు పెచ్చులుగా అవుతుంటే ఈ పువ్వుల రసాన్ని లేపనంగా వాడితే ఆ సమస్య సులభంగా తగ్గుతుంది. ఉత్తర భారత దేశంలో ఈ పువ్వులను పలు రకాల కూరల్లో కూడా ఉపయోగిస్తారు.
గునుగు పూలు:
గునుగు పువ్వుల్లోనే కాకుండా ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇవి యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ మైక్రోబియల్ గుణాలతో పాటు యాంటీ డయాబెటిక్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అందుకే వీటి ఆకులను గాయాలపై ముద్దగా చేసి రాస్తారు. రక్తహీనత ,మలబద్ధకం ,హైబీపీ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుల తో చేసిన కూర తినడం వల్ల ఉపశమనం పొందుతారు.
తంగేడు పూలు:
తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు పువ్వు ప్రత్యేకంగా బతుకమ్మలో పేర్చడానికి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఆయుర్వేద పరంగా కూడా ఔషధ గుణాలు ఎక్కువగా కలిగిన తంగేడు పువ్వుని వైద్యంలో ఉపయోగిస్తారు. మూత్ర నాల సమస్యలతో బాధపడేవారికి చేసే చికిత్సకి ముఖ్యంగా తంగేడు పూలను వాడుతారు. కీళ్ల నొప్పులకు ఈ పువ్వు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
సీతమ్మవారి జడగంటల పూలు:
వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ ముచ్చటపడి జడగంటలుగా ఉపయోగించిన కారణంగా ఈ పూలకు సీతమ్మ వారి జడగంటలు అని పేరు వచ్చింది. బతుకమ్మను మరింత అందంగా చేసే సీతమ్మ వారి జడగంట్ట పువ్వులు గ్లూకోమా, క్యాటరాక్ట్‌లు, హై బీపీ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
చామంతి, బంతి పూలు:
బతుకమ్మ కనే కాదు ఇంట్లో జరిగే ఏ పండుగకైనా బంతి , చామంతి లేకపోతే పరిపూర్ణత రాదు. బంతి ,చామంతి పూలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి. పైగా ఇది యాంటీ బగ్, యాంటీ పెస్ట్ రెపల్లెంట్‌గా కూడా ఉపయోగపడతాయి. చైనా వంటి దేశాలలో వీటితో చేసిన టీ ని ఎక్కువగా సేవిస్తారు.
బతుకమ్మకు సాంప్రదాయబద్ధంగా వాడే ఈ పువ్వులనే కాకుండా మార్కెట్లో విరివిగా దొరికే లిల్లీలు, మల్లెలు, తామరతో పాటు ఇంటి వద్ద లభ్యమయ్యే గన్నేరు, దోస, బీర, మందార, గడ్డి పూలతో కూడా అలంకరిస్తారు. బతుకమ్మ ఎంత అందంగా, రంగులమయంగా ఉంటే వారి జీవితం అంత ఆనందంగా ఉంటుందని భావిస్తారు.
Also Read: Bathukamma 2023: తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకుంటారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి