Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎక్కించుకుని బాహుబలి రేంజులో తిరుమల కొండ మెట్లెక్కుతూ అందరినీ ఔరా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టేలా చేశాడు సత్తి బాబు. అలాగని అలా భార్యను ఎత్తుకుని కొండపైకి నడిచి వస్తానని ఆయనేమీ ఆ వెంకన్నకు మొక్కుకోలేదు. మరి సత్తిబాబుకు ఆ అవసరం ఏమొచ్చింది ? ఇంతకీ ఈ సత్తి బాబు ఎవరనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం... సత్తి బాబు పూర్తి పేరు వరదా వీర వెంకట సత్యనారాయణ. బంధువుల, స్నేహితులు అంతా అతన్ని ముద్దుగా సత్తి బాబు అని పిలుచుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సత్తిబాబు స్వస్థలం. లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని.
ఇక అసలు విషయంలోకి వస్తే.. సత్తి బాబు తాజాగా తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి తిరుమల వెళ్లే భక్తుల్లో చాలామంది మెట్ల మార్గంలో కొండపైకి వస్తామని మొక్కుకుంటుంటారు. అక్కడి భక్తుల్లో ఇది ఎక్కువగా కనిపించే ఆచారం. అలాగే సత్తి బాబు దంపతులు కూడా మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి ప్రయాణమయ్యారు. మధ్యలో కొంతదూరం వెళ్లిన తర్వాత భర్త సత్తిబాబు వేగంగా మెట్లు ఎక్కుతుండగా తాను వెనుకబడి పోతుండటం చూసిన సత్తి బాబు భార్య లావణ్యకు ఏం చేయాలో అర్థంకాక ఆయనకు ఓ సవాల్ విసిరింది. నువ్వొక్కడివే మెట్లు ఎక్కడంలో ఏం గొప్ప ఉంది.. నన్ను ఎత్తుకుని కూడా వేగంగా వెళ్తే అప్పుడు నువ్వు గొప్ప అని ఒప్పుకుంటా అని సవాల్ విసిరిందామె.
భక్తులకు షాకిచ్చిన సత్తిబాబు, లావణ్య
భార్య లావణ్య విసిరిన సవాలును క్షణం ఆలస్యం లేకుండా స్వీకరించిన సత్తిబాబు.. ఆమెను భుజాలపై ఎక్కించుకుని కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఆరోగ్యరీత్యా ఎంతో ఫిట్‌గా ఉంటే తప్ప.. లేదంటే మామూలుగానే తిరుమల కొండ మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు ఆయాసం వచ్చి మధ్యమధ్యలో బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలాంటిది సత్తిబాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా భార్య లావణ్యను భుజాలపై మోసుకుని మెట్లు ఎక్కుతూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఆ దృశ్యం చూసి షాకవడం జనం వంతయ్యింది. సత్తిబాబు మొక్కులో ఇది కూడా ఓ భాగమేమో అని కొందరు సరిపెట్టుకుంటే.. సత్తి బాబు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక ఇంకొంత మంది నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు.
సోషల్ మీడియాలో హీరో అయిన సత్తిబాబు
సత్తిబాబు హుషారుగా మెట్లెక్కే తీరు చూసి ఆ ఇద్దరిదీ కొత్తగా పెళ్లయిన జంట అనుకునేరు..!! అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వాళ్ల పెళ్లి జరిగి 24 ఏళ్లయిపోయిందండోయ్. ఏంటి షాకయ్యారా ? ఆగండాగండి.. షాకులు ఇంతటితోనే అయిపోలేదు... ఇంకా ఉన్నాయ్. ఎందుకంటే.. సత్తిబాబు-లావణ్య దంపతుల పెళ్లయి 24 ఏళ్లు అవడమే కాదు.. వాళ్లిద్దరి కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అవును.. మీరు చదివింది నిజమే. చిన్నల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా.. అతడికి మంచి జాబ్ వస్తే అమ్మానాన్నలు, అత్తామామల రెండు కుటుంబాలను తీసుకుని తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నారట. ఆ మొక్కు తీర్చుకునే కోరికలో భాగంగానే 40 మంది బస్సులో తిరుపతికి వచ్చారు. ఈ క్రమంలోనే సత్తి బాబు ఈ రేర్ ఫీట్ చేసి మొదట అక్కడున్న భక్తుల కంట్లో పడ్డారు. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యావత్ నెటిజెన్స్ కంట్లో పడ్డారు.
సత్తిబాబు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే..
ఇలాంటి సీన్స్‌ని మనం కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం కానీ నిజ జీవితంలో చాలా చాలా అరుదు. మొత్తానికి పెళ్లయిన 24 ఏళ్ల తర్వాత కూడా సత్తిబాబు అండ్ కపుల్ ఇంత స్లిమ్‌గా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నారంటే.. నిజంగా ఆ జంటను అభినందించి తీరాల్సిందే. అన్నింటికిమింటి భార్య అడగ్గానే.. ఆమె కోరికను కొట్టిపారేయకుండా ఆమెను ఎత్తుకుని 70 మెట్ల వరకు ఎక్కిన అతడి సాహసాన్ని, భార్య లావణ్య పట్ల అతడికి ఉన్న ఇష్టాన్ని మనం మెచ్చుకుని తీరాల్సిందే. అన్యోణ్య దాంపతం అంటే ఇదే కదా!! సత్తిబాబు జంటను ఇప్పుడిలా చూసి భవిష్యత్తులో చాలా మంది వారిని ఆదర్శంగా తీసుకోవడం ఖాయం.. ఎప్పుడో అప్పుడు మనం ఇలాంటి దృశ్యాలు చూడటం ఖాయం. ఏమో.. సోషల్ మీడియాలో ఇకపై ఇదొక ఛాలెంజ్ తరహాలో మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీప్ రాకింగ్ సత్తిబాబు అండ్ కపుల్.
Also Read : Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి