Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
తిరుమల శ్రీవారిని కలియుగంలో చాలా మంది భక్తులు తమ కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా చెప్తుంటారు. శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎన్నిగంటలైన క్యూలైన్లలో వేచి ఉండటం చేస్తుంటారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి వస్తే.. తిరుమల స్థానికులకు శ్రీవారికి దర్శనం విషయంలో కీలక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. చెప్పినట్లుగా.. కూటమి సర్కారు.. తిరుమలలో అనేక మార్పులు చేపట్టింది. అంతే కాకుండా.. తిరుమలలో ఇటీవల కొత్తగా టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. బీఆర్ నాయుడును దీనికి చైర్మన్ గా ఎంపిక చేశారు.
ఈ క్రమంలో ప్రతినెల మొదటి మంగళవారం తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శన కల్గించే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్థానిక భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 2న.. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు.
అదే విధంగా..మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య జారీ చేస్తారని సమాచారం. ముందుగా వచ్చినవారికే తొలి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తొంది. దీనికోసం ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్ హాల్ (దివ్యదర్శనం) క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. అదే విధంగా.. దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు. అయితే.. ఇక్కడ మాత్రం స్థానికుల కోటాలో.. దర్శనం చేసుకున్న వారికి తిరిగి.. 90 రోజుల వరకూ దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.
అంటే.. ఒక సారి దర్శనం చేసుకున్న వారు.. మరల స్వామి దర్శనం కోసం మూడు నెలల పాటు వేచి ఉండాల్సిందే. దీంతో కొంత మంది భక్తులు మాత్రం.. ఈ మెలికతో స్థానిక భక్తులు ఒకింత.. నిరుత్సాహ పడుతున్నారంట. కొందరు ప్రతినెల దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారంట. కానీ మరికొందరు మాత్రం.. తమకు స్వామివారి దర్శనం అవుతుందని మాత్రం సంబర పడుతున్నారంట.