ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 50 రోజుల్లో రెండోసారి భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. మోదీకి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా పొత్తులపై చర్చలు జరిపేందుకు ఈ భేటీ అని విశ్లేషకులు భావిస్తున్నారని ప్రముఖ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతంలో పలుమార్లు మోదీని కేసీఆర్ ప్రశంసించడం, టీఆర్ఎస్ జమిలి ఎన్నికలకు జైకొట్టడం, ఇటీవల అవిశ్వాసంపై లోక్సభలో జరిగిన చర్చలోనూ కేసీఆర్ను మోదీ మెచ్చుకోవడం, ఇప్పుడీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడుతున్నాయి. ఎన్నికల అనంతరం పొత్తుకు టీఆర్ఎస్ అనుకూలమని సమాచారం.
శనివారం సాయంత్రం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీతో సుమారు గంటపాటు ఏకాంత చర్చలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ ప్రత్యేకంగా వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు జీవిత బీమా, హరితహారం పథకాల గురించి ప్రధాన చర్చ జరగ్గా.. తెలంగాణ సాధిస్తున్న ఫలితాలపై ప్రధాని సంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు, రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆవశ్యకత, హైకోర్టు విభజన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, కాళేశ్వరానికి గ్రాంట్లు, రైల్వే లైన్లు, కేంద్రీయ విద్యాలయాలు ఇలా మొత్తం 11 అంశాల గురించి వివరించగా ప్రధాని మోదీ వాటిలో కొన్నింటికి సానుకూలంగా ఉన్నారని సమాచారం.