Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు విపక్షాలన్ని ఏకం కావాల్సి ఉందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోయాయి. 2014 తరహాలో ఏపీలో మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడుతుందనే ప్రచారం సాగుతోంది.
పొత్తులపై హాట్ హాట్ గా చర్చలు సాగుతుండగానే కీలక ఘటనలు జరిగాయి. రాజధాని అంశం ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన నిర్వహించిన రోజే విశాఖలో పర్యటించారు జనసేనాని. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి జరగడం, జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం టెన్షన్ పుట్టించింది. పవన్ విశాఖలో ఉన్నప్పుడే పీఎంవో కార్యాలయం నుంచి పవన్ కు కాల్ వచ్చిందని తెలుస్తోంది. మీతో మాట్లాడి మీ యోగక్షేమాలకు తెలుసుకోవాలని ప్రధానమంత్రి చెప్పారని పవన్ తో చెప్పారట పీఎంవో అదికారి హితెన్ రాజ్. జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారని తెలిపారట. అయితే రాజకీయ పోరాటంలో ఇవన్ని కామనేనని.. తాను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని అతనికి పవన్ చెప్పారని తెలుస్తోంది.
పోలీసులు పవన్ ను ప్రత్యేక విమానంలో విజయవాడ తరలించారు. పవన్ విజయవాడ వచ్చాకా రాజకీయంగా అసలు కథ నడిచింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కల్యాణ్ ను కలిశారు. తర్వాత ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైందనే వార్తలు వచ్చాయి. సీట్ల విషయంలోనే క్లారిటీ వచ్చిందని.. బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీతో జనసేన కలిసి వెళ్లడం ఖాయమనే సీన్ క్రియేట్ అయింది. విజయవాడలో పవన్ ను చంద్రబాబు కలవడంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది.
జనసేన చీఫ్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దూతగా సీనియర్ నేత బీఎల్ సంతోష్ దగ్గరుండి పవన్ ను ఢిల్లీకి తీసుకువెళ్లారని సమాచారం. పవన్ కోసం బీజేపీ పెద్దలే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారట. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు పవన్ ను రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి పవన్ నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లిపోయరు.
అమిత్ షాతో జరిగిన సమావేశంలో మూడు నాలుగు అంశాల్లో పవన్ కల్యాణ్ క్లారిటీ తీసుకున్నారని తెలుస్తోంది. బీజేపీ జగన్ కు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని సూటిగా అడిగారట. ప్రధాని మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూ అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించారట. టీడీపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో తెలుసుకున్నారట. సందర్బంగా పవన్ ను కూల్ చేస్తూ మాట్లాడిన అమిత్ షా.. జగన్ పై తమకేమి అసక్తి లేదని చెప్పారట.
టీడీపీ విషయంలో ఆరెస్సెస్ తో పాటు ఇతర బీజేపీ వర్గాల నుంచి వ్యతిరేకత లేకున్నా ప్రధాని మోడీ మాత్రం జగన్ పై సానుకూలంగా ఉన్నారని అమిత్ షా చెప్పారని సమాచారం. పొత్తులపైనా పవన్ తో అమిత్ షా చర్చించారని సమాచారం.
పొత్తులపై ఇప్పుడే చర్చించాల్సిన అవసరం లేదని.. వైసీపీ పై ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని కంటిన్యూ చేయాలని పవన్ కు సూచించార. వైసీపీపై పోరాటంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారట అమిత్ షా. ఏపీలో ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలతో మంచి మైలెజ్ వస్తుందని.. ఎన్నికల వరకు దాన్ని అలానే కంటిన్యూ చేయాలని సూచించారట.
పవన్ తో చర్చల సందర్భంగానే అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2014 తరహాలో మూడు పార్టీలు కలిసి పని చేసేందుకు సిద్ధమేననే సంకేతం ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికి మనమెందుకు కష్టపడాలి అని పవన్ తో అమిత్ షా అన్నారని తెలుస్తోంది. నిన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించమను... 25 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు గెలిచి చంద్రబాబును కేంద్ర కేబినెట్ లో చేరమని.. అలా అయితేనే మనం ముందుకు పోదాం అని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ కూడా పొత్తులు, టీడీపీ విషయంలో మౌనంగానే ఉంటున్నారు. అమిత్ షా తనతో చర్చించిన అంశాలపై జనసేన ముఖ్య నేతలతో పవన్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. జనసేన నేతల అభిప్రాయం ప్రకారనే గబ్బర్ సింగ్ ముందుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
ప్రధాని మోడీ టీడీపీ విషయంలో ఆగ్రహంగా ఉండటానికి గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరే కారణమంటున్నారు.2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ చేరింది. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు బెర్త్ దొరికింది. అయితే 2018లో ప్లేట్ మార్చారు చంద్రబాబు. ప్రత్యేక హోదా డిమాండ్ తో బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ పొత్తుకు బైబై చెప్పేశారు బాబు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ ఎంపీలు తప్పుకోగా.. ఏపీ మంత్రివర్గం నుంచి బీజేపీ బయటికి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ లక్ష్యంగా జాతీయ స్థాయిలో దూకుడు రాజకీయాలు చేశారు చంద్రబాబు. యూపీఏ కూటమిలో చేరారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని మోడీని ఉగ్రవాది అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా తిరుపతికి వస్తే.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. బీజేపీని ఓడించాలంటూ దేశ వ్యాప్తంగా తిరిగి సోనియా, రాహుల్ తో కలిసి సభలు నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకు వ్యతిరేకంగా చేసిన రచ్చను బీజేపీ పెద్దలు ఇంకా మర్చిపోలేదని అంటున్నారు. ఈ విషయాన్నే పవన్ కల్యాణ్ తో చర్చల సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారని తెలుస్తోంది. మొత్తంగా కొన్ని రోజులుగా పొత్తుల చుట్టు తిరుగుతున్న ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్, అమిత్ షా సమావేశం కీలకంగా మారిందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే పొత్తుకు ఓకే! చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా..
పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి.
చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?