దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వాధీనంలోని వివిధ బ్యాంకుల సిబ్బంది మే 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు సమ్మె చేయనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఈ నెల 5న జరిగిన సమావేశంలో నామమాత్రంగా 2 శాతం జీతం పెంపుదలను ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు.
గత రెండు మూడేళ్లుగా బ్యాంకుల ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలైన జన్‌ధన్ యోజన, డీమోనిటైజేషన్, ముద్ర, అటల్ పెన్షన్ యోజన అమలు కోసం ఎంతో శ్రమించి పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమాల కారణంగా ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. గత వేతన పెంపు కాలం 2012 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 31 వరకు 15 శాతం వేతన పెంపును ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
కాగా ఇప్పటికే సమ్మెపై బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రకటించగా, సమాఖ్య ప్రతినిధులతో అధికారులు సోమవారం ఢిల్లీలో జరిపిన చర్యలు విఫలమవడంతో మే 30,31 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్లు మరోమారు బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రకటించింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.