Nirmala Sitharaman Comments on KCR: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిందని... రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఏ స్థాయిలో ఉందంటే. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై ప్రస్తుతం 1.25 లక్షల రూపాయల అప్పు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. మన ఊరు మన బడి పథకం అందుకు ఉదాహరణగా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని లక్షా 20 వేల కోట్లకు పెంచారని గుర్తుచేసిన ఆమె.. తెలంగాణ పరిధిలోని అన్ని ప్రాజెక్టులపై భారీ వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
అడిగినందుకు కేంద్రంపై నిందలేస్తున్నారు
కేంద్రం అమలు చేస్తున్న పథకాల పేర్లు మార్చుడు, నిధులు ఇచ్చినా ఇవ్వడం లేదని నిందలేయడం, ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టుల వ్యయం పెంచి అప్పులు చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి షరా మామూలైపోయిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదేంటని కేంద్రం ప్రశ్నిస్తే.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రాలకు సహకరించడం లేదని నిందలేస్తున్నారని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్‌పై అవాకులు చెవాకులు పేలి ఆ తర్వాత అయిష్టంగానే ఆ పథకంలో చేరారు అని అన్నారు.
కేసీఆర్ మాట్లాడుతుంటే నితీష్ లేచి వెళ్లిపోయారు..
కేసీఆర్ బీహార్ పర్యటనలో ఏం జరిగిందో అందరు చూశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతుండగానే బీహార్ సీఎం నితీష్ కుమార్ లేచివెళ్లిపోవడం అందరం చూశాం అని కేసీఆర్‌కి చురకలంటించే ప్రయత్నం చేశారు. ఇంతకంటే ఎక్కువ కేసీఆర్‌కు ఇంకేం కావాలని ఎద్దేవా చేశారు.
అందుకే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు..
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నారు. రైతులు పంట నష్టపోతే ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. ఫసల్ బీమా యోజన ఇవ్వని కారణంగా అప్పుల పాలైన రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రతీ 100 మంది రైతుల్లో 90 మంది రైతులు అప్పుల ఊబీలో చిక్కుకుపోతున్నారని.. అందుకే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని.. అలాగే కౌలు రైతులకు రైతు బీమా ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ సర్కారును నిలదీశారు.
Also Read : CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..నితీష్ కుమార్‌తో కీలక మంతనాలు..!
Also Read : K.Laxman: ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతోందా..? బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి