తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. అలిపిరి సమీపంలో ఆయన కాన్వాయ్‌ను కొందరు యువకులు అడ్డుకొని తమ నిరసనను తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి వచ్చిన వారు "అమిత్ షా గోబ్యాక్" అని నినాదాలు చేస్తూ కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. ఇంతలో పోలీసులు వచ్చి నిరసన చేస్తున్నవారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో అక్కడ పరస్పర వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఈ విషయంపై అమిత్ షా స్పష్టత ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు ఎంతటికీ కదలకపోవడంతో.. అలిపిరి గరుడ సర్కిల్ వద్దకు అదనపు పోలీసులను రప్పించారు. అయితే ఆందోళనకారుల్లో పలువురు టీడీపీ జెండాలు కూడా పట్టుకొని ఉండడం గమనార్హం.
బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. అలాంటప్పుడు అమిత్ షా తిరుమలకు ఎందుకొచ్చారని ఆందోళనకారులు ఆయనను ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు అమిత్ షా.