Addanki Dayakar Exclusive Interview : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద అలజడే కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపోవడంతో ఆయన్నే ఉద్దేశించి ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా.. అంటూ రెచ్చగొట్టేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం సృష్టించాయి. అద్దంకి కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ఉన్న వేదికపైనే అద్దంకి అలా వ్యాఖ్యానించడం అంటే అది కుట్రపూరిత వ్యాఖ్యలుగానే భావించాల్సి ఉంటుందని ఆరోపించారు. అంతేకాకుండా తనకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి కోరుకున్నట్టుగానే ఆ తర్వాత ఆయనకు, పార్టీకి అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు.
ఇక్కడ సీన్ కట్ చేస్తే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించినట్టుగానే.. అద్దంకి దయాకర్ అలా పరుష పదజాలంతో దారుణ వ్యాఖ్యలు చేయడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా అనే ఆరోపణలు బయట కూడా వినిపించాయి. గతంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశించి భంగపడిన వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒకరు. ఎప్పుడైతే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చారో.. అప్పటి నుండే కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారనే టాక్ కూడా బలంగా వినిపించింది. స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒకట్రెండు సందర్భాల్లో మీడియా సాక్షిగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తానే అద్దంకి దయాకర్ వెనుకుండి అతడి చేత అలా పరుష పదజాలం ఉపయోగించి మరీ దూషణలకు దిగేలా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై తాజాగా జీ న్యూస్ తెలుగు నిర్వహించిన బిగ్ డిబేట్ విత్ భరత్ షోకు ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన అద్దంకి దయాకర్ని ప్రశ్నించగా.. ఆయన తనదైన స్టైల్లో జవాబిచ్చారు. '' తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు'' అని అద్దంకి చెప్పుకొచ్చారు. మునుగోడు సభా వేదికపై కలుసుకున్నాకా రేవంత్ రెడ్డి ఒకవైపు, తానొక వైపు వెళ్లిపోయామని.. అసలు తనకు వేదికపై మాట్లాడే అవకాశమే వస్తుందనుకోలేదని అద్దంకి వివరించారు. తాను నల్గొండ జిల్లా వాసిని కావడంతో అనుకోకుండానే తనకు కొంతసేపు మాట్లాడే అవకాశం లభించింది కానీ ఇందులో రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అస్సలే లేదని అద్దంకి దయాకర్ స్పష్టంచేశారు.
ఒక్కటే జిల్లా వాసులం కావడంతో పార్టీలో తాను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసే పనిచేశాం. మునుగోడు సభకు వచ్చే సమయంలో వాహనంలో కొంతమంది మిత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. " వెంకట్ రెడ్డి సభకు రాకపోతే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా'' అని సందేహాం వ్యక్తంచేశారు. వాళ్లు వాహనంలో ఏదైతే మాట్లాడారో.. అదే ప్రజాభిప్రాయంగా తాను సభా వేదికపై చెప్పడం జరిగింది. కాకపోతే తప్పుడు మాటలు ఉపయోగించడం మాత్రమే తప్పు కానీ తాను మాట్లాడినదాంట్లో ఏమాత్రం తప్పు లేదని అద్దంకి దయాకర్ (Addanki Dayakar Latest News) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ తన అభిప్రాయం అదేనని అన్నారు.
Also Read : Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈటల.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook