ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను మే 2న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. అనంతరం విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్లకు ర్యాంకులను పంపిస్తామని పేర్కొన్నారు. ఎంసెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.sche.ap.gov.in లో చూసుకోవచ్చని తెలిపారు. www.manabadi.com, www.schools9.com వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చునని సూచించారు.
ఏపీ ఎంసెట్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) పర్యవేక్షణలో జేఎన్టీయూ కాకినాడ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్-2018 ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 25వ తేదీవరకు నాలుగు రోజుల పాటు నిర్వహించారు. ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారంగా అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 22-24వ తేదీ వరకూ ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి, 25వ తేదీన అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి పరీక్ష జరిగింది. ఈ ఏడాది ఎంసెట్‌కు సుమారు 2 లక్షల 75వేల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.