అప్పుడు యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు బాహుబలి

                

Last Updated : Oct 23, 2017, 02:17 PM IST
అప్పుడు యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు బాహుబలి

యంగ్ రెబల్ స్టార్.. ఇది సినీ కథానాయకుడు ప్రభాస్‌కి ఒకప్పుడు అతని అభిమానులు పెట్టుకున్న పేరు.. కానీ ఇప్పుడు ఆ పేరుకన్నా తను పోషించిన బాహుబలి పాత్రే బాగా పాపులరైపోయింది. ఒక్క బాహుబలితో ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు ప్రభాస్..  నేడు ప్రభాస్ అంటే బాహుబలి.. బాహుబలి అంటే ప్రభాస్. చాలామంది ఉత్తరాది వారికి ప్రభాస్ పేరు తెలిసినా తెలియకపోయినా.. బాహుబలి పేరు మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది.. అదంతా ఆ పాత్ర ఔచిత్యం.. తనను ఇప్పటికీ అదే పేరు పెట్టి పిలుస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు తెలుసుకుంటూ.. బాహుబలి మీద కూడా కొన్ని ప్రత్యేక విషయాలు కవర్ చేద్దాం..!

  • ప్రముఖ తెలుగు నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు 23 అక్టోబరు, 1979 తేదీన మద్రాసులో జన్మించారు ప్రభాస్. రెబల్ స్టార్ క్రిష్ణంరాజు ప్రభాస్‌కు స్వయానా పెదనాన్న అవుతారు. చిన్నప్పుడు భీమవరంలోని డీఎన్‌ఆర్ స్కూల్‌లో చదువుకున్న ప్రభాస్, హైదరాబాద్‌లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 
  • ప్రభాస్ నటించిన తొలి చిత్రం ఈశ్వర్ 2002లో విడుదలైంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాఘవేంద్ర, అడవిరాముడు, చక్రం మొదలైన చిత్రాలలో నటించారు ప్రభాస్. శోభన్ దర్శకత్వంలో త్రిష సరసన నటించిన "వర్షం" చిత్రం ప్రభాస్ కెరీర్‌లోని తొలి బ్లాక్ బస్టర్ చిత్రం. ఆ తర్వాత పౌర్ణమి, యోగి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, రెబల్, మున్నా మొదలైన చిత్రాల్లో నటించారు ప్రభాస్

  • ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి చిత్రాలు ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్. మిర్చి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు ప్రభాస్. అదేవిధంగా డార్లింగ్ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా మా అవార్డ్స్ జ్యూరీ పురస్కారం అందుకున్నారు. 
  • ప్రభాస్ నటించిన తొలి హిందీ చిత్రం "యాక్షన్ జాక్సన్". ఇందులో సోనాక్షి సిన్హా సరసన ఒక పాటలో తళుక్కున మెరుస్తారు ప్రభాస్.
  • ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ ఉప్పలపాటి ఒక స్టార్ ప్రొడ్యూసర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన తన స్నేహితునితో కలిసి రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి చిత్రాలు తీశారు. ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.
  • సినిమాల్లోకి రాక మందు ప్రభాస్‌కి మంచి స్టార్ రెస్టారెంట్ ప్రారంభించాలని ఆలోచన ఉండేదట. అలాగే వంటలంటే తనకు చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ స్వయంగా చేసుకొని తినడమంటే కూడా ప్రభాస్‌కి చాలా ఇష్టం.
  • ప్రభాస్ అభిమాన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ సినిమాలు ఆయన మళ్లీ మళ్లీ చూస్తుంటారట. అలాగే ప్రభాస్ అభిమాన నటుడు హాలీవుడ్ స్టారైన రాబర్ట్ డి నిరో. అలాగే ప్రభాస్ అభిమాన సినిమా భక్త కన్నప్ప. తన పెదనాన్న క్రిష్ణంరాజు నటించిన ఈ సినిమాని తర్వాత ప్రభాస్‌తో రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఆ ప్రయత్నమెందుకో తెరపైకి రాలేదు. 

బాహుబలి ముచ్చట్లు

  • బాహుబలి సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాలు ఎలాంటి సినిమా కూడా సైన్ చేయలేదు ప్రభాస్. అలాగే ఓ ఫిట్‌నెస్ సంస్థ ఆఫర్ చేసిన 5 కోట్ల ఎండార్స్‌మెంట్ కూడా వదులుకున్నారు.
  • బాహుబలి సినిమా కోసం ఫిట్నెస్ పెంచుకోవడం కోసం తన ఇంటిలోనే ప్రత్యేకంగా వాలీబాల్ కోర్టు నిర్మించుకున్నారు ప్రభాస్
  • ప్రభాస్ బాహుబలి సినిమాకి సైన్ చేశాక, పాత్ర కోసం దాదాపు 30 కేజీలు బరువు పెరిగారట. 
  • బాహుబలి సినిమా కోసం ప్రత్యేకంగా లక్ష్మణరెడ్డి అనే ప్రఖ్యాత ఫిట్‌నెస్ ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకున్నారు ప్రభాస్. 1.5 కోటి రూపాయల విలువైన జిమ్ ఎక్విప్‌మెంట్ విదేశాల నుండి రప్పించుకున్నారు ప్రభాస్. 
  • బాహుబలి సినిమా నిమిత్తం ప్రతీ రోజు స్పెషల్ డైట్ తీసుకొనేవారు ప్రభాస్. ఆ డైట్ మెనూలో 40 కోడిగడ్లు, ప్రొటీన్ పౌడర్ తప్పనిసరిగా ఉండేవి.
  • మేడమ్ టుస్సాడ్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియంలో ప్రభాస్ మైనపుబొమ్మను ప్రతిష్టించారు. బాహుబలి గెటప్‌లోనే ప్రభాస్ బొమ్మ అక్కడ ఉంటుంది.
  • బాహుబలి చిత్రం రెండు భాగాల్లోనూ నటించినందుకు ప్రభాస్ తీసుకున్న మొత్తం రెమ్యూనరేషన్ 25 కోట్లు

 

 

 

Trending News