గృహ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేదల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కనెక్షన్లు తీసుకున్నాక గ్యాస్ స్టవ్‌కి రూ. 900, గ్యాస్ సిలిండర్‌కి రూ.700 చెల్లింపులను ఈఎంఐ (EMI) పద్ధతిలో వసూలు చేసేలా స్కీంను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్-14) రోజున పంపిణీ ప్రారంభించాలని కేంద్రం చమురు సంస్థలను ఆదేశించింది. కాగా లబ్దిదారుల ఎంపిక బాధ్యతను రేషన్ డీలర్లకే అప్పగించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేదలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రచార కార్యక్రమాల కరపత్రాలను కూడా కేంద్రమే రాష్ట్రాలకు పంపనుంది.
కనెక్షన్ డిపాజిట్ సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తోంది. లబ్ధిదారులు పైసా చెల్లించనక్కర్లేదు. కనెక్షన్ తీసుకున్న ఏడో నెల నుంచి సిలిండరు తీసుకోగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసే సబ్సిడీ సొమ్మును వాయిదా మొత్తంగా కేంద్రం రాబట్టుకోనుంది. కనెక్షన్ ఇచ్చినట్లు నిర్ధారించుకున్న మీదట ఆ మొత్తాన్ని డీలర్ల ఖాతాల్లో సర్దుబాటు చేయనుంది.
లబ్దిదారుల ఎంపిక బాధ్యతను రేషన్ డీలర్లకే..!
రేషన్ దుకాణాలు.. ఈ-సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వివరాలను సేకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఎస్సీ, ఎస్టీ, అత్యంత వెనుకబడినవారు, నదీ తీర ప్రాంతాల్లో, తేయాకు తోటల్లో పని చేసే వారు, అటవీ ప్రాంత నివాసితులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతి డీలరు తొలిదశలో వంద కనెక్షన్లు ఇవ్వాలి. అంబేద్కర్ జయంతి రోజున వందమందికి కనెక్షన్లు అందచేయాలని రెండు రాష్ట్రాల డీలర్లకు చమురు సంస్థలు స్పష్టం చేశాయి.