తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వమన్న పత్రికా ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఇది నిజమైన వార్తలు రాసే జర్నలిస్టులను నియంత్రించేలా ఉందని సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విషయం గురించి కేవలం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనే మాట్లాడాలని సూచించారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) వంటి సంస్థలు ఈ ఫేక్ వార్తలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) అభిప్రాయపడుతోంది. తప్పుడు వార్తలకు సంబంధించిన పత్రికా ప్రకటనను వెనక్కి తీసుకోవాని పిఎంఓ సమాచార & ప్రసార మంత్రిత్వశాఖకు సూచించింది.
#FLASH: Prime Minister has directed that the press release regarding fake news be withdrawn and the matter should only be addressed in Press Council of India. pic.twitter.com/KVUBeAoDhC
— ANI (@ANI) April 3, 2018
PIB Accreditation Guidelines asking Press Council of India & News Broadcasters Association to define & act against ‘fake news’ have generated debate. Several journalists & organisations have reached out giving positive suggestions regarding the same. 1/2
— Smriti Z Irani (@smritiirani) April 3, 2018
.@MIB_India is more than happy to engage with journalist body or organisation/s wanting to give suggestions so that together we can fight the menace of ‘fake news’ & uphold ethical journalism. Interested journalists and/or organisations may feel free to meet me at @MIB_India. 2/2
— Smriti Z Irani (@smritiirani) April 3, 2018
'ఫేక్ వార్త' అని ఎవరు, ఎలా నిర్థారించగలరు? అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అహ్మద్ పటేల్ సహా విపక్షాలు, మీడియా, నెటిజన్ల నుంచి ప్రశ్నలు రావడంతో.. 'దీనిపై అంతా కలిసి చర్చిద్దాం ప్రస్తుతానికి పక్కనబెడుతున్నాం' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
అంతకుముందు తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్) శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. ఈ మేరకు విలేకర్ల గుర్తింపునకు సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. దీంతో ఫేక్ న్యూస్ ప్రచురించిన/ప్రసారం చేసినట్లు రుజువైతే సంబంధిత విలేకరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు రద్దు చేస్తారు. రెండోసారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు రద్దు చేస్తారు. మూడోసారీ తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలియజేసింది.
నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) పరిశీలనకు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినవయితే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) పరిశీలనకు పంపిస్తామని తెలిపింది. ఫిర్యాదులపై ఈ సంస్థలు 15 రోజుల్లోగా నిర్ణయాన్ని చెప్తాయని అంది. ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి నిర్ణయం వెలువడేంతవరకు ఆ విలేకరి గుర్తింపును నిలిపివేస్తామని చెప్పింది. ' తప్పుడు వార్త' అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకున్నా.. నిబంధనలు అతిక్రమించే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై చర్యలుంటాయంది. వినియోగదారులకు అభిప్రాయాలు చూపి తప్పుదోవ పట్టించకుండా నైతిక విలువలు పాటించాలని తెలిపింది.