హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిశుభ్రత కొరకు రోబోలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోనే ప్రప్రథమంగా ఈ ప్రయోగాన్ని ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణకు ఆ కీర్తి దక్కనుంది. శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో హమీనుల్ హసన్ జాఫ్రీ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిస్తూ, నగరంలో భూగర్బ డ్రైనేజీ, రోడ్ల శుభ్రత పనుల కోసం రోబోలను తెప్పిస్తున్నట్టు చెప్పారు. నగర ప్రజలకు ప్రతిరోజు నీళ్ల సరఫరా కోసం సీఎం కేసీఆర్ వినూత్న ప్రణాళిక సూచించారన్నారు.
ఔటర్‌రింగ్ రోడ్డు వెంట రింగ్‌మెయిన్ పైప్ లైన్ నిర్మిస్తున్నామని, కృష్ణా, ఇటు గోదావరితోపాటు మంజీర వంటి నదీజలాలు ఎటు నుంచి వచ్చినా ఈ రింగ్మెయిన్లో కలిశాకే నగరానికి సరఫరా అయ్యే విధంగా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఈ పైప్ లైన్ పూర్తయితే నగర నీటి కొరతకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. నగరంలోని 25 లక్షల కుటుంబాలకు ప్రతిరోజు నీటిసరఫరా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని షాపుల్లో రిజర్వేషన్ల విధానం అమలు చేస్తున్నట్టు, ఉద్యోగ ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.