Key Factors Behind BJP victory in UP: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీదే అధికారమని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని నిలుపుకునే దిశగా దూసుకెళ్తోంది. రైతులను జీపుతో తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరీలోనూ బీజేపీనే ఆధిక్యంలో ఉండటం ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత అంతగా లేదనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 260 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. రెండోసారి అధికార పగ్గాలు అందుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు యూపీలో బీజేపీ రెండోసారి గెలిచేందుకు దోహదపడిన అంశాలేంటో పరిశీలిద్దాం..
యోగి క్లీన్ ఇమేజ్ :
జాతీయ వాదం, సుపరిపాలన, అభివృద్ధి.. ఈ మూడు అంశాలతో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. తాజా ఫలితాలు గమనిస్తే యూపీ ప్రజలు ఈ మూడు అంశాల పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారనే చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న జనాకర్షణ, కేంద్రమంత్రి అమిత్ షా వ్యూహాలు, యోగి ఆదిత్యనాథ్ క్లీన్ ఇమేజ్.. ఇవన్నీ బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీలు బలహీనపడటం, ఐదేళ్ల పాలన తర్వాత కూడా యోగి ఆదిత్యనాథ్‌పై ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం ప్రజల్లో ఆయన పట్ల ఆదరణను మరింత పెంచింది.
సంక్షేమ పథకాలు :
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో ఎక్కువమంది ఓటర్లను ఆ పార్టీ వైపు ఆకర్షించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత రేషన్ పథకంతో పాటు నగదు బదిలీ పథకాలు ఎక్కువ మంది పేదలను బీజేపీ వైపు ఆకర్షించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉచిత రేషన్ పథకం ద్వారా దాదాపు 15 కోట్ల మంది పేదలు లబ్ది పొందారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు వంటివి కూడా ఆ పార్టీకి భారీగా ఓట్లు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అలాగే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు వరి, గోధుమ పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్న హామీలు రైతుల ఓట్లను కూడా బీజేపీ వైపు మళ్లించాయంటున్నారు.
గంపగుత్తగా మహిళా ఓట్లు :
ఈసారి బీజేపీ గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టిందని అక్కడి మహిళలు భావిస్తున్నారు. ముఖ్యంగా యాంటీ రోమియో స్క్వాడ్ ద్వారా మహిళలకు గూండాలు, రౌడీలు, పోకిరీల నుంచి రక్షణ కల్పించినట్లయిందని భావిస్తున్నారు. అలాగే, యోగి సర్కార్ అందిస్తున్న ఉచిత రేషన్ వారిని బీజేపీ వైపు మరింత ఆకర్షితులను చేసింది. దీన్ని గమనించి ఎస్పీ కూడా ఉచిత రేషన్ హామీని ఇచ్చినప్పటికీ మహిళా ఓటర్లు మాత్రం బీజేపీ వైపే మొగ్గుచూపారు. కులాలకు అతీతంగా మహిళా ఓటర్లు బీజేపీకి పెద్ద ఎత్తున ఓటు వేశారు.
కలిసొచ్చిన హిందుత్వ :
బీజేపీ హిందుత్వ నినాదం మరోసారి కులాలకు అతీతంగా ఓటర్లను ఏకం చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో 80 వర్సెస్ 20 అంటూ హిందువులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు యోగి. రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటివి హిందూ ఓటర్లు ఆ పార్టీ వెనక నడిచేలా చేశాయి.
Also Read: Assembly Election Results 2022 LIVE*: యూపీలో విజయం దిశగా బీజేపీ- రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
Also Read: NZ vs IND: హర్మన్‌ప్రీత్ పోరాడినా.. ప్రపంచకప్‌లో టీమిండియాకు తప్పని ఓటమి!!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరు... కాషాయ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలివే..
యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం
బీజేపీకే పట్టం కట్టిన యూపీ ప్రజలు
బీజేపీ గెలుపులో దోహదం చేసిన అంశాలివే..