ఉత్తరప్రదేశ్లోని ఆజాంగఢ్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహపు తలను పగలగొట్టారు. ఈ సమాచారం అందగానే స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పని చేసిన దుండగులను పట్టుకొనే ప్రయత్నాలను ముమ్మురం చేస్తామని.. వారిని ఎట్టిపరిస్థితిలోనైనా కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.
త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన తర్వాత.. దేశంలోని పలుచోట్ల పలువురు నేతల విగ్రహాల పై దాడులను ముమ్మరం చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటికే తమిళనాడులో ద్రావిడ నేత పెరియార్ రామస్వామి విగ్రహాన్ని కూల్చేసిన ఘటనలో కేసు నమోదైంది. అలాగే కోల్కతాలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూడా ఎవరో విరగొట్టారు.
ఆ తర్వాత మీరట్లో అంబేద్కర్ విగ్రహాన్ని, కేరళ కన్నూర్ ప్రాంతంలో గాంధీ విగ్రహాన్ని పగలగొట్టారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు ప్రకటనలను జారీ చేసింది. శాంతి భద్రతల విషయంలో మెరుగైన సేవలు అందివ్వమని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడమని తెలిపింది. విగ్రహాల కూల్చివేతలను ప్రోత్సహించే వారిని ఉపేక్షించవద్దని.. వారిపై కేసులు నమోదు చేయమని తెలిపింది.