తెలంగాణ సీఎం కేసీఆర్‌కి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి వుందేమోననే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కోసం ఓ ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సుని సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ది హన్స్ ఇండియా న్యూస్ పోర్టల్ ప్రచురించిన ఓ కథనం ప్రకరాం.. సీఎం కేసీఆర్ భద్రత కోసం రాష్ట్ర రవాణా శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఈ ప్రయత్నంలో భాగం పంచుకుంటున్నట్టు సమాచారం. రూ. 7 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుని రానున్న కాలంలో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనల కోసం వినియోగించనున్నట్టు ఆ కథనం స్పష్టంచేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తర్వాతి కాలంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మారుమూల పల్లెల్లో కలియ తిరిగేందుకు కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, ఆ సమయంలో కేసీఆర్ ఉపయోగించనున్న బస్సు ఇదేనని ఆ కథనం పేర్కొంది.
రహదారులు మరియ భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ నేతృత్వంలోని కమిటీ ఈ ప్రతిపాదనని పరిశీలించి త్వరలోనే ఓ నివేదిక ఇవ్వనుందట. ఈ నివేదిక అందిన తర్వాత మూడు నెలల్లో బస్సు రూపొందనున్నట్టు కథనం వెల్లడించింది. సీఎం కేసీఆర్ రక్షణ కోసం మాత్రమే కాకుండా మారుమూల పల్లెల్లో పర్యటించే సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు, అసౌకర్యాలు ఎదురవకుండా పలు ఆధునిక హంగులతో ఈ బస్సుని రూపొందించేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్టు సమాచారం.
అయితే, సాధారణంగా మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయి నేతల భద్రతను వారి వ్యక్తిగత భద్రత సిబ్బంది, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుండటం జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ, రహదారులు, భవనాల శాఖ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది అనే విషయంలోనే కొంత స్పష్టత కొరవడింది.