ఇప్పటివరకు మనము సోదరి-సోదరుడు మధ్య అనుబంధం అంటే రాఖీ పండగ ఒక్కటే ఉందని అనుకున్నాం. కానీ, 'భగినీ హస్త భోజనం' అనే మరో పండుగ ఉందని ఎవరికీ తెలీదు. ఈ పండుగ దీపావళి వెళ్లిన రెండవరోజు, కార్తీక శుద్ధ విదియనాడు వస్తోంది. ఆ రోజున సోదరి ఇంట్లో చేతి భోజనం చేస్తే సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా వివాహమైన సోదరి ఇంట సోదరుడు, తల్లితండ్రులు భోజనం చేయరు. కారణం.. ఆడపిల్ల పుట్టింటి ఋణం ఉంచుకోకూడదు కాబట్టి! శుభకార్యాలకు వచ్చి బోంచేసినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి భోజనం చేయకూడని సంప్రదాయం ఉంది. కానీ 'భగినీ హస్త భోజనం' పర్వదినాన సోదరుడు వివాహమైన సోదరి ఇంట చేతి భోజనం తినాల్సిందేనని పురాణంలో పేర్కొన్నారు.
ఇందుకు ఒక కారణం కూడా ఉంది. ఒకనాడు యమధర్మరాజు సోదరి యమున ఇంట చేతి భోజనము చేసి ఆమె అతిథ్యానికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమ్మా! అని అనగా, యమున 'అన్నా! ఈరోజున సోదరి ఇంట ఎవ్వరు భోజనం చేసినా వారికి సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించు' అని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన యముడు ‘తథాస్తు’ అంటాడు. యముడు యమునకు ఇచ్చిన వరం కారణంగా విదియనాడు సోదరి చేతి భోజనం చేసిన సోదరునికి సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని పండితులు చెపుతున్నారు. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో 'భాయ్- దూజ్' అని, నేపాల్ లో 'భాయి- టికా' అని పిలుస్తారు. మరుసటి రోజున సోదరుడు, సోదరిని భోజనానికి పిలవాలి. దీనినే 'సోదరి తృతీయ' అంటారు.