శీతాకాల విడిదిలో భాగంగా భాగ్యనగరానికి వచ్చిన రాంనాథ్ కోవింద్ దంపతులకు గవర్నర్ నరసింహన్ దంపతులు విందు ఇచ్చారు. ఆదివారం సాయంత్రంరాజ్ భవన్ లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాటు ఇరురాష్ట్రాల మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ విందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వచ్చారు. చిరంజీవి, దగ్గుబాటి రానా, ప్రతిపక్ష నాయకులు, అధికారులు హాజరయ్యారు.
ఈ విందులో సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వీరిద్దరూ పలకరించుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అక్కడున్నవారందరికీ ఆశ్చర్యపరిచింది. ఏం మాట్లాడుకున్నారో తెలీదుకానీ.. సరదా సన్నివేశాలు జరిగాయక్కడ. కేసీఆర్, నీ రాజకీయం మంచిగా ఉందా? అని అన్నారు.
పవన్-కేసీఆర్ ఆది నుంచి ఎడమొహం, పెడమొహం గానే ఉన్నారు. రాష్ట్రవిభజన జరిగినప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలతూటాలు పేలాయి. ఒకానొక దశలో నేను పవన్ కళ్యాణ్ ను అస్సలు పట్టించుకోనని కేసీఆర్ చెప్పారు. ఏపీలో ఎన్నికలు జరిగితే 1 శాతం ఓటుకూడా రాలవని మొన్న నంద్యాల ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే..!
పవన్, కేసీఆర్ ముచ్చట్లు
గవర్నర్ విందులో కేసీఆర్, పవన్ తారసపడటం, మాట్లాడుకోవడం గమనిస్తుంటే..రాజకీయ అంశాలు ఏవైనా చర్చకు వచ్చాయా? లేదా వ్యక్తిగత అంశాలనే మాట్లాడుకున్నారా? అని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఏదైతేనేం వీరిద్దరూ కలవడం, ముచ్చట్లు చెప్పుకోవడం చూసి అక్కడున్నవారందరూ అవాక్కయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని పవన్-కేసీఆర్ రుజువుచేశారని కొందరు గుసగుసలాడారు.
ఇదేకాదు కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎంపీ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరూ కలుసుకున్నారు. అన్నదమ్ములు రాజకీయాలతీతంగా ఇలా విందులో కలుసుకోవడంతో మెగా అభిమానులు సంతోషించారు.