విదేశీయులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలంటే ముందే వీసా తీసుకొని రావలసిన అవసరం లేదు. ఏపీకి వచ్చే విదేశీయులు ముందుగా 'వీసా ఆన్ అరైవల్' కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. వారు వైజాగ్ విమానాశ్రయంలో దిగిదిగ్గానే వీసా ఇస్తారు. ఈ వెసులుబాటును కల్పిస్తూ తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఏపీకి విదేశీ ప్రముఖుల తాకిడి గణనీయంగా పెరగనుంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకులు నేరుగా విశాఖ పట్టణం విమానాశ్రయంలో దిగి, అక్కడ వీసా తీసుకొని ఏపీ రాష్ట్రంలో పర్యటించవచ్చని మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. దేశ వ్యాప్తంగా 17 విమానాశ్రయాల్లో ఈ వెసులుబాటు ఉండగా.. తాజాగా ఆ జాబితాలోకి ఏపీని చేర్చడం హర్షించదగ్గ విషయమంటూ మంత్రి పేర్కొన్నారు. శనివారం ఈ-టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్ (ఈ-టీవీఓఏ) సౌకర్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు.