ఇది ఓ వృద్ధుడి కన్నీటి గాధ. ఒకప్పుడు గొప్ప వ్యాపారవేత్తగా బతికిన ఆయన.. పరిస్థితి బాగుండకపోవడంతో సర్వం కోల్పోయి జీవనాధారం కోసం టెంపో నడుపుకోవాల్సి వచ్చింది. వీటితో పాటు కుటుంబ కలహాలు, కలతలు ఎప్పుడూ తనను కుదురుగా ఉండనీయలేదు. అందరికీ దూరంగా ఉండి తన బ్రతుకు వెళ్లదీస్తున్న ఆయన తన మనవడు గొప్ప క్రికెటర్ అయ్యాడన్న విషయం తెలుసుకొని.. అతన్ని చూడడానికి అహ్మదాబాద్‌కు వచ్చాడు. అయితే తన అయినవారే తనని దూరం పెట్టడానికి ప్రయత్నించినప్పుడు.. మళ్లీ అందరికీ దూరంగా వెళ్లిపోయాడు. అంతలోనే శవమై తిరిగొచ్చాడు. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఆ మరణం వెనుక కథ ఏమిటి...? ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యువ భారతీయ క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాకి స్వయాన తాతయ్య అయిన సంతోఖ్ సింగ్ దీనగాథ ఇది.
జస్ప్రీత్ బూమ్రా.. ప్రస్తుతం భారతీయ యువ క్రికెటర్లలో తనకుంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫాస్ట్ బౌలర్. టీ20 మ్యాచ్‌ల్లో చెలరేగి ఆడిన కుర్రాడు. బూమ్రా తండ్రి జస్బీర్ చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి దల్జీత్ చేతుల మీదే పెరిగాడు. తన తండ్రి కుటుంబంతో సంబంధాలు కూడా అతనికి అంతంతమాత్రమే. ఈ క్రమంలో జస్ప్రీత్ తండ్రికి తండ్రైన సంతోఖ్ సింగ్ ఈ నెల తన కుమార్తెను చూడడానికి వచ్చినప్పుడు.. తనకు ఓసారి మనవడిని చూడాలని ఉందని.. ఈ నెల 6వ తేదీన జస్ప్రీత్ పుట్టినరోజు సందర్భంగా వెళ్లి అతన్ని కలవాలని ఉందని చెప్పాడట.
అయితే ఈ విషయాన్ని జస్ప్రీత్ తల్లితో చెప్పగా.. ఆమె నిరాకరించింది. అతన్ని చూడడం ఇప్పుడు కుదరదు అని కూడా చెప్పడంతో నిరాశ చెందాడు సంతోఖ్ సింగ్. ఈ క్రమంలో ప్రతీ రోజు జస్ప్రీత్ ఇంటికి వెళ్లి అతన్ని చూడడానికి ప్రయత్నించేవాడు సంతోఖ్. ఆఖరికి తన మనవడితో ఫోన్లో మాట్లాడడానికి కూడా ఎవరూ అనుమతించపోవడంతో నిరాశ చెందిన సంతోఖ్ అదే బాధను తన కూతురి వద్ద వెళ్లబోసుకొనేవాడు. ఈ క్రమంలో ఈ నెల ఆరవ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. తన తండ్రి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సంతోఖ్ కుమార్తె రాజీందర్ కౌర్.
ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఎట్టకేలకు ఈ రోజు సంతోఖ్ మృతదేహాన్ని అహ్మదాబాద్ దగ్గరలోని సబర్మతీ నదిలో గుర్తించారు. అయితే సంతోఖ్ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా అతన్ని ఎవరైనా హత్య చేసుంటారా? అన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని అంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో సంతోఖ్ కుమార్తె ఇంటి దగ్గరలోని స్థానికుల నుండి వివరాలు కూడా సేకరిస్తున్నారు. సంతోఖ్ను ఇంట్లోవారు పెద్దగా పట్టించుకొనే వారు కాదని.. అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని కొందరు అంటున్నారు. ఈ మధ్యకాలంలో జార్ఖండ్ లో నివసించే తన కుమారుడికి కూడా ఫోన్ చేసి తన విచారాన్ని సంతోఖ్ వెల్లిబుచ్చాడని కూడా పోలీసుల ఎంక్వయిరీలో తేలింది.
ఒకప్పుడు సంతోఖ్ సింగ్‌కు ఉత్తరాఖండ్‌లో నాలుగు ఫ్యాక్టరీలు ఉండేవట. తన పెద్ద కుమారుడు మరియు జస్ప్రీత్ తండ్రి జస్బీర్ బూమ్రా ఆ ఫ్యాక్టరీలలో తండ్రికి సహాయంగా పనిచేసేవాడు. అయితే తన కుమారుడు మరణించడంతో సంతోఖ్ కూడా కొన్నాళ్లు ఫ్యాక్టరీలు బంద్ చేశాడు. ఆ తర్వాత వ్యాపారంలో నష్టం రావడంతో వాటిని అమ్మేసి.. అప్పులు తీర్చి ఓ టెంపో కొనుక్కొని అదే ప్రాంతంలో జీవించేవాడట. 2010లో తన భార్య కూడా మరణించడంతో ఒంటరి వాడైపోయాడు ఆయన. ఈ క్రమంలో క్రికెటర్‌గా వెలుగొందుతున్న తన మనవడిని ఒకసారి చూడాలని వచ్చి.. ఆఖరికి శవమైపోయాడు సంతోఖ్.