Daaku Maharaaj review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ.. బాలయ్య సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా..!

Daaku Maharaaj review: బాలయ్యను సంక్రాంతిని విడదీసి తీయలేము. పొంగల్ సీజన్ లో విడుదలైన బాలకృష్ణ మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ కోవలో 2025 సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’సినిమాతో పలకరించారు. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ సంక్రాంతి హిట్ అందుకున్నట్టేనా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 12, 2025, 12:01 PM IST
Daaku Maharaaj review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ.. బాలయ్య సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా..!

మూవీ రివ్యూ: డాకు మహారాజ్ (Daaku Maharaaj)
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, రవికిషన్ శుక్లా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, టామ్ చాకో, సత్య,  మకరంద్ దేశ్ పాండే తదితరులు
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
డైరెక్షన్: బాబీ కొల్లి
విడుదల తేది: 12-1-2025

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం  ‘డాకు మహారాజ్’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్మైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. మరి సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
 

కథ విషయానికొస్తే..

ఈ సినిమాను 1996  నేపథ్యంలో మదనపల్లిలో ప్రారంభమవుతోంది. అక్కడ టీ ఎస్టేట్ ఓనర్ ( సచిన్ ఖేడ్ కర్) టీ ఎస్టేట్ తో పాటు ఓ స్కూల్ రన్ చేస్తుంటాడు. వాళ్ల కొంత భాగాన్ని అక్కడి స్థానిక ఎమ్మెల్యే నాయుడు (రవి కిషన్)కు లీజుకు ఇస్తాడు. అతడు అక్కడ టీ బదులు కొకైన్ పండిస్తుంటాడు. ఈ క్రమంలో టీ ఎస్టేట్ ఓనర్ కోర్టు వెళ్లి ఎమ్మెల్యేను ఆ టీ ఎస్టేట్ ఖాళీ చేయమని కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొస్తాడు. దీంతో పగ పట్టిన ఎమ్మెల్యే టీ ఎస్టేట్ మనవరాలిని చంపాలని చూస్తుంటాడు. ఆ ఇంట్లో పనిచేసే గోవింద్ గుజ్జర్ పాపను కాపాడడానికి (మకరంద్ దేశ్ పాండే) జైలు శిక్ష అనుభవిస్తున్న డాకు మహారాజ్ (బాలకృష్ణ)ను అక్కడికి పిలిపిస్తాడు. అయితే జైలు నుంచి తప్పించుకు వచ్చిన డాకు మహారాజ్ ఇక్కడ పాప ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో పాపకు, డాకు మహారాజ్ కు ఉన్న  సంబంధం ఏమిటి ? మరోవైపు మైనింగ్ పేరు కొకైన్ స్మగుల్ చేసే బలవంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్ ) ఎవరు ? డాకు మహారాజ్ కు అతనికి ఉన్న సంబంధం ఏమిటి ?మధ్యలో ఇంజినీర్ సీతారామ్ ఎవరు..?  గ్రానైట్ మాటున కొకైన్ ను స్మగ్లింగ్ చేసే  బలవంత్ సింగ్ ఠాకూర్ చేసిన అరాచకాలను డాకు మహారాజ్ ఎలా అడ్డుకున్నాడు.  దోచుకోవడానికి కాకుండా.. ప్రజలను కాపాడేందుకు  ‘డాకు మహారాజ్’  ఏం చేసాడు. శిష్ట రక్షణ కోసం కత్తి పట్టిన ‘డాకు మహారాజ్’ చివరకు దుష్ట శిక్షణ ఎలా చేశాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

బాబీ తన గత చిత్రాలను పరిశీలిస్తే.. చిన్న పాయింట్ చుట్టే కథ మొత్తాన్ని తిప్పడం బాబీ మార్క్ స్టైల్. గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండటం దానికి ‘డాకు మహారాజ్’ టైటిల్ తోనే  ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసాడు. ఈ సినిమాను కూడా  1990 నాటి  బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా బాలయ్యను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో పూర్తిగా అన్ని మసాలాలు ఏది ఎక్కువగా తక్కువగా కాకుండా.. సరిగ్గా సంక్రాంతి సినిమాను అందించాడు బాబీ. 

అనగనగా ఒక రాజు ఉండేవాడు. అది కూడా రాజ్యం లేని రాజు. ఇందులో ‘డాకు మహారాజ్’ పాత్రను రాబిన్ హుడ్ తరహాలో తెరకెక్కించాడు దర్శకుడు. అంతేకాదు బాలయ్యను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి కొన్ని సీన్స్ లలో గూస్ బంప్స్ తెప్పించాడు.  బోయపాటి శ్రీనును మించి బాలయ్యలోని ప్లస్ లను తనకు తగ్గట్టు మలుచుకున్నాడు. బాలయ్య కాస్ట్యూమ్స్ విషయంలో మంచి శ్రద్ద తీసుకున్నాడు. ఆ విషయంలో మెచ్చుకోవాలి.  ఇక ఊర్వశి రౌతెలాతో బాలయ్య రొమాంటిక్ సాంగ్ వెగటు పుట్టించేలా ఉంది. ఈ చిత్రంలో  బాలయ్య.. డాకు మహారాజ్ గా.. సీతారామ్, నానాజీ గా మూడు విభిన్న పాత్రల్లో చూపించాడు. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ అన్ని సినిమాల్లో చూసిందే.కానీ హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా పాపను కాపాడే ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. అంత ఫైటులో కూడా పాపకు ఇష్టమైన మ్యాగీ చేసిపెట్టే సీన్ హైలెట్ గా నిలిచింది.

బాబీ ఈ సినిమాను ఓ సోషల్ ఇష్యూను బేస్ చేసుకొని తెరకెక్కించాడు. మధ్య ప్రదేశ్ లోని చంబల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చుక్క నీరు కోసం అలమటించే గ్రామం. అక్కడ నీటి కోసం రోజంత బలవంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్ ) క్వారీలో  కూలి చేసి సంపాదించిన డబ్బులు పెడితే కానీ నీళ్లు కొనుక్కోలేని స్థితి. ఓ సీన్ లో కావడిలో నీళ్లు పెట్టి అక్కడ నుంచి కొంత దూరం నీళ్లు తొణక్కుండా వెళితే.. మీకు నెల రోజులు ఉచితంగా నీళ్లు ఇస్తామని క్వారీలో ఎదురు తిరిగిన గ్రామస్తుడికి చెబుతాడు. కానీ అతడు వెళుతున్న క్రమంలో నీరు తొణకడంతో అతన్ని చంపేస్తాడు. ఈ రకంగా ఓ వ్యక్తిని చంపి మొత్తం గ్రామస్తులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు. ఈ రకంగా విలన్ ఎంత క్రూరుడనేది ఈ సినిమాలో చూపెట్టాడు. కొన్ని సీన్స్ చూస్తే విక్రమార్కుడు, కిక్ 2 సినిమాలు గుర్తుకు వస్తాయి. మరోవైపు ఊరి ప్రజల బాగు కోసం క్వారీ ఉన్న స్థలమే డ్యామ్ కు అనువైనదని ఇంజినీర్ సీతారామ్ చెబుతాడు.

బాబీ ఈ సినిమాను  బాలయ్య పాత సినిమాలనే మిక్సీలో వేసి రుబ్బాడు. హీరో ఎందుకు డాకుగా మారాడనే విషయమై క్లారిటీ ఇచ్చాడు. ఏదో  పద్దతి పాడు లేకుండా నరకడమే పనిగా పెట్టుకున్నట్టు కాకుండా ఓ ఆశయం కోసం గండ్ర గొడ్డలి పట్టిన కల్కి అవతారంగా హీరో క్యారెక్టర్ ను చూపించాడు.  మొత్తంగా రొటీన్ కథే అయినా.. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా ఈ సినిమా బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించడం పక్కా చెప్పొచ్చు.

మరోవైపు హీరోకు ధీటైన విలన్ పాత్రలో బాబీ డియోల్ పాత్రను రాసుకున్నాడు. అది బాగా పండింది. బాలయ్య తర్వాత శ్రద్దా శ్రీనాథ్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆమె పాత్రనే ఈ సిినిమాకు మెయిన్ పిల్లర్.   తమన్ ఈ సినిమాకు అందించిన ఆర్ఆర్ థియేటర్స్ లో స్పీకర్స్ పగిలిపోయేలా ఇచ్చాడు. ఊర్వశి రౌతెలా పాట తప్ప.. మిగతావన్ని సన్నివేశాలకు తగ్గ పాటలే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా బాలయ్యతో రొటీన్ కాకుండా సోషల్ మెసేజ్ తో కూడాని  రివేంజ్ డ్రామాను  తెరకెక్కించాడు. ఫైనల్ గా పాపకు, డాకు మహారాజ్ కు మధ్య రిలేషన్ ఏంటనే విషయమై బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

నటీనటుల విషయానికొస్తే..

బాలకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 50 యేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడంటే ఆయన నటనకు సలామ్ కొట్టాల్సిందే. ఈ సినిమాలో  డాకు మహారాజ్ గా .. సీతారామ్ గా.. రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు. డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య ఒదిగిన తీరు అద్భుతం. బాబీ దేవోల్ తన పరిధి మేరకు మెప్పించాడు. హీరోకు ధీటుగా నటించి మెప్పించాడు.   శ్రద్ధా శ్రీనాథ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గా ఈ సినిమాకు  మెయిన్ పిల్లర్ గా నిలిచారు.  ప్రగ్యా జైస్వాల్ కథ ప్రకారం నటించింది.  ఊర్వశి రౌతెలా ఏదో ఐటెం సాంగ్ కోసం పెట్టినట్టు ఉంది. రవికిషన్ శుక్లా, మకరంద్ దేశ్ పాండే తమ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్

డాకు మహారాజ్ బాలయ్య హై ఓల్టేజ్ యాక్షన్

నిర్మాణ విలువలు

తమన్ ఆర్ఆర్

మైనస్ పాయింట్స్

సాంగ్స్

లాజిక్ లేని సీన్స్

రేటింగ్: 2.75/5

పంచ్ లైన్.. ‘డాకు మహారాజ్’..హై ఓల్టేజ్ సోషల్ మెసెజ్ డ్రామా

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News