దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఈ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీ అల్లర్లను ఆయన ఇంటెలిజెన్స్ వైఫల్యంగా అభివర్ణించారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల పదుల సంఖ్యలో మృతి చెందారని విమర్శించారు. వందలాదిగా ఆస్పత్రి పాలయ్యారన్నారు. అల్లర్లు చెలరేగితే ఏ ప్రభుత్వమైనా ఉక్కుపాదంతో అణచివేయాల్సి ఉందని తలైవా సూచించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే 25 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆయన మిత్రుడు, విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ నుంచి మద్ధతు లభించింది. నిశ్శబ్దాన్ని ఛేదించావు మిత్రమా అంటూ ఆయన ట్వీట్ చేశారు. మీరు ఎంచుకున్న పథం సరైనది తెలిపారు. దానిని అలాగే కొనసాగించాలని సూచించారు.
నిజానికి కమల్ హాసన్, రజినీకాంత్ .. రెండు వైరుధ్య భావాలు కలిగిన వ్యక్తులు. రాజకీయ యవనికపై రాణించాలనుకుంటున్న వారిద్దరూ .. తమ తమ భావజాలాలతోనే ముందుకు వెళ్తున్నారు. చాలా అంశాలు ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ .. ఈ ఒక్క విషయంలో మాత్రం .. వారిద్దరి ఆలోచనా విధానం కలవడం విశేషం.