పాట్నా: సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై మరోసారి దాడి జరిగింది. బీహార్‌లోని అర్రాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో కన్నయ్య కుమార్ కాన్వాయ్‌లోని (Kanhaiya Kumar's convoy) ఓ వాహనం ధ్వంసం కాగా కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న వారిలో కొంత మందికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని ( Citizenship Amendment Act ) వ్యతిరేకిస్తూ కన్నయ్య కుమార్ బీహార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కన్నయ్య కుమార్ చేపట్టిన ఈ పర్యటనను వ్యతిరేకిస్తున్న మరో వర్గం ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కన్నయ్య కుమార్ భోజ్‌పూర్ జిల్లా కేంద్రమైన అర్రాలో ఏర్పాటు చేసిన ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. జనవరి 30న జన గణ మన యాత్ర చేపట్టినప్పటి నుంచి ఇప్పటికే ఎన్నోసార్లు కన్నయ్య కుమార్‌పై దాడి జరిగిందని.. ఈసారి తృటిలో దాడి నుంచి తప్పించుకున్నామని కన్నయ్య కుమార్‌తో పాటే ఈ యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మెద్ పీటీఐకి తెలిపారు.
బక్సర్ జిల్లాలో ఓ సభలో ప్రసంగం ముగించుకుని అర్రాకు బయల్దేరిన కన్నయ్య కుమార్ మార్గం మధ్యలో ఉండగా ఈ దాడి జరిగింది. గతంలో కన్నయ్య కాన్వాయ్‌పై జరిగిన దాడుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే ఓ పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చిందని.. దాడి జరిగిన సమయంలో తమ కాన్వాయ్ ఆ పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని అనుసరిస్తూ వెళ్తోందని ఎమ్మెల్యే షకీల్ అహ్మెద్ వెల్లడించారు. ఉన్నట్టుండి రోడ్డుకి ఇరువైపుల 25-30 మంది వరకు యువకులు చేతిలో కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ఉండటాన్ని గమనించి తమ వాహనం డ్రైవర్ బ్రేకులు వేశాడని.. అయితే, అప్పటికే పోలీసుల ఎస్కార్ట్ వాహనం కొంత ముందుకు వెళ్లిపోవడంతో యువకులు తమ వాహనంపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే షకీల్ అహ్మెద్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..