హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కేవలం 10వేల కోట్ల రూపాయలు మాత్రమే రాబడి ఉన్నటువంటి లిక్కర్ని నాలుగు సంవత్సరాల్లోనే దాదాపు రూ. 21వేల కోట్లకి పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం సొంతమని.. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న వ్యాపారాత్మక ధోరణిని ఇకనైనా అదుపు చేయకపోతే రాష్ట్రంలో యువత పెడదోవనపట్టి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ఈ మత్తులో మునిగిపోయే ప్రమాదం ఉందని నేతలు గవర్నర్‌కి తెలిపారు. యువత ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయేటటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున కన్పిస్తోంది కనుక రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపుల్ని, పర్మిట్ రూంలను, రోడ్లపై ఉన్న వైన్ షాపులన్నింటిని కూడా మూసివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్‌ని కోరినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రజల మన, దాన, ప్రాణాలను కాపాడటం కోసం కాకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల కార్యకలాపాల కోసం, వారి నాయకుల రక్షణ కోసం, వారి కార్యకర్తల కేసులకోసమే వాడుతున్నరని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీస్ యంత్రాంగాన్ని స్వేచ్ఛగా, చట్టబద్ధంగా, ఏ ఉద్దేశ్యంతో ప్రజల రక్షణ కోసం వ్యవస్థీకృతమైందో ఆ వ్యవస్థను ఆ రకంగానే పనిచేసేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలు గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు. ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు, దాడులు పెరిగి రాష్ట్రం పరువు-ప్రతిష్టలు పోయే స్థాయికి పరిస్థితి దిగజారిందని గవర్నర్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులోనూ పోలీసులు తొలుత తమ పరిధిలోకి రాదంటే.. తమ పరిధిలోకి రాదని తిరస్కరించి నిర్లక్ష్యం వహించారని గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు.
అయితే, ప్రజల కోసం కాకుండా కేవలం టీఆర్ఎస్ నేతల కోసమే పనిచేస్తామనే విధంగా ఉన్న తెలంగాణ పోలీసుల వైఖరిలోనూ ఇకనైనా మార్పు రాకపోతే.. కాంగ్రెస్ పార్టీ సైతం ఒక కార్యచరణ రూపొందించి వారిపై చట్టపరమైన పోరాటం చేయడానికి వెనుకాడబోదని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.