అమరావతి: ఇప్పటికే అగ్రిగోల్డ్‌లో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారి కోసం తొలి విడతలో రూ.264కోట్లు మంజూరుచేసిన ఏపీ సర్కార్.. తాజాగా రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య డిపాజిట్ చేసి నష్టపోయిన బాధితులకూ ఓ తీపికబురు అందించింది. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య డిపాజిట్ చేసిన బాధితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అగ్రిగోల్డ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని 2019-20 వార్షిక బడ్జెట్లో వారి కోసం కేటాయించిన రూ.1,150 కోట్ల నిధుల నుంచి బాధితులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఏపీ సర్కార్ శుక్రవారమే ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అగ్రిగోల్డ్ నుంచి నష్టపరిహారం కోసం వేచిచూస్తున్న బాధితులకు త్వరలోనే ఆ డబ్బులు చేతికి అందనున్నాయి.