హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీకి చెందిన ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని చత్తీస్ఘడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2013లో జరిగిన బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల ఘటనల్లో ప్రధాన నిందితుడికి ఆశ్రయం కల్పించినట్టుగా అజారుద్దీన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ రెండు ఘటనల్లో ఇప్పటికే 17 మంది అరెస్ట్ కాగా గత ఆరేళ్ల నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న అజారుద్దీన్.. సౌది అరేబియాలోని ఓ సూపర్ మార్కెట్లో డ్రైవర్‌గా, సేల్స్ మెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉన్నాడు. తాజాగా అజారుద్దీన్ సౌది అరేబియా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. హైదరాబాద్ విమానాశ్రయంలో మాటువేసి పట్టుకున్నాయి.
చత్తీస్ఘడ్ పోలీసులు ఎందుకొచ్చారంటే..
అజాహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీ స్వస్థలం చత్తీస్ఘడ్ రాజధాని రాయపూర్‌లోని మౌధాపరా కావడంతో అక్కడి పోలీసులు అతడిని పట్టుకోవడం కోసం ఎప్పటి నుంచో నిఘా వేసి పెట్టారు. ఈ క్రమంలోనే అతడు హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం అందుకున్న చత్తీస్ఘడ్ పోలీసులు, ఏటీఎస్ అధికారులతో సహాయంతో బృందాలు విడిపోయి చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించి మరీ అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి అతడిని చత్తీస్‌ఘఢ్‌కు తీసుకెళ్లారు. అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీ సిమి ఉగ్రవాద సంస్థకు స్లీపర్ సెల్‌గా పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అజహరుద్దీన్ నుంచి పాస్ పోర్టు, రెండు డ్రైవింగ్ లైసెన్సులు, ఓటింగ్ పాస్, ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డు స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. చత్తస్‌ఘడ్ డిఐజి, ఎస్ఎస్పి ఆరిఫ్ షేక్, రాయ్‌పూర్ మునిసిపల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు త్రిలోక్ బన్సాల్, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.