సమయం ఎలాంటిదైనా.. సందర్భం ఏదైనా సరే.. వైసీపీ చీఫ్ , ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ ఒక్కటే ..అది తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు,ప్రతిపక్ష పార్టీ టీడీపీని బలహీనం చేయాలి. ఈ లక్ష్య సాధన కోసం ఎన్నికల ముందు జగన్ ఎన్నో ఎత్తులు వేశారు ..ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా సరికొత్త ఎత్తుగడలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి లక్ష్మీ పార్వతిని తనవైపు తిప్పుకున్న వైఎస్ జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆపరేషన్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొదలెట్టేశారని మీడియా కోడై కూస్తోంది. ఔనా ఇది నిజామా అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే చెప్పక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కృష్ణాజిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్పు !!
కృష్ణా జిల్లా పేరును నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెడతాను..ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ సొంత ఊళ్లో పర్యటించిన సందర్భంలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఇది. ఇప్పుడు అధికారంలోకి వచ్చేశారు. ఏపీలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తాననే హామీని నిలబెట్టుకునే దిశగా జగన్ పావులు కదుపుతున్నట్లు మీడియాలో కథనాలు వెలుడుతున్నాయి.
ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం బందర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తే బందర్ ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలనే జగన్ భావిస్తున్నట్లు టాక్. వెన్నుపోటు అంశాన్ని ఇప్పటికే వైసీపీ జోరుగా ప్రచారం చేసుకుంటూ వస్తోంది. చంద్రబాబు కేవలం ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు తప్పితే.. అసలైన గుర్తింపు తామే ఇచ్చామనే జనాల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్ ఈ స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్ గా జూ.ఎన్టీఆర్ !!
ఇదే క్రమంలో ఎన్టీఆర్ ఫ్యామిలీని జగన్ తనవైపు తిప్పుకునే సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎలాగో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు, టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అలాగే ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా అదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రభుత్వంలో ఏదో రకంగా భాగస్వామిని చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మద్యపాన నిషేదానికి బ్రాండ్ అంబాసిడర్ జూనియర్ ఎన్టీఆర్ ను నియమించాలని..అది కుదరకుంటే ఏపీ టూరీజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ వార్తలను వైసీపీ ఖండించినప్పటీకీ ఏదో ఒక రూపంలో జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా కథనాలు మాత్రం ఇంకా హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ జగన్ ప్రతిపాదనను ఒప్పుకోకుంటే కనీసం కల్యాణ్ రామ్ ను దగ్గర తీసుకొని ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలనే జగన్ ఆలోచనలో ఉన్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరగుతోంది.
ద్విముఖ వ్యూహం అంత ఈజీ కాదు..
ఇలా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేసి సీనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇచ్చి ....జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గర తీసుకుంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ తనవైపు వస్తుందని.... ఫలితంగా ఎన్టీఆర్ ఫ్యామిలీని చంద్రబాబు,టీడీపీకి దూరం చేసి తనవైపు తిప్పుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు తెగ చర్చించుకుంటున్నారు. ఒక వేళ జగన్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేసినా ... అంత ఈజీగా ఎన్టీఆర్ ఫ్యామిలీ జగన్ ట్రాప్ లో పడబోదనే అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎటువైపు మొగ్గుచూపుతుందో... వేచి చూడాల్సిందే మరి !!