గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో ఒక్కటైన అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపానీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ కొత్తపేరు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని పురాతన భద్రకాళి మాత ఆలయాన్ని సందర్శించినప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ ఆలయాన్ని మధ్యయుగంలో నిర్మించారని.. అప్పుడు ఆ నగరం పేరు కర్ణావతిగా పేర్కొనేవారని పలువురు భావిస్తున్నారు. అదే అంశాన్ని గుజరాత్ సీఎం రూపానీ ప్రస్తుతం పేర్కొన్నారు.
అయితే ఆర్ఎస్ఎస్ అనేక సంవత్సరాలుగా అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చమని చెబుతోంది. కరణ్ దేవ్ అనే హిందూ చక్రవర్తి పేరు మీద 11వ శతాబ్దంలో ఈ నగరాన్ని నిర్మించారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం గుజరాత్ సీఎం తీసుకుంటున్న నిర్ణయం పై పలువురు కాంగ్రెస్ నేతలు పెదవి విరిచారు. ఎన్నికల సందర్భంలో రూపానీ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్‌కు పాల్పడుతున్నారని తెలిపారు.
తాజాగా అహ్మదాబాద్ మేయర్ బిజల్ పటేల్ కూడా ఈ అంశంపై తన స్పందనను తెలియజేశారు. ప్రభుత్వం సూచనలకు అనుగుణంగానే తాము మార్పులకు శ్రీకారం చుడతామని ఆయన పేర్కొన్నారు. "ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన ఉత్తర్వులు ఇస్తే.. మేం వాటిని పాటిస్తాం. ఒకవేళ వారు నగరం పేరును కర్ణావతిగా మార్చమంటే అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేగానీ.. ప్రభుత్వం ప్రమేయం లేకుండా మేం ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే ప్రసక్తి లేదు" అని పేర్కొన్నారు.